ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ సాధిస్తాం
ఆత్మకూర్: స్థానిక పురపాలికకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని.. ఇప్పటికే రూ.400 కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ సాధించడమే తన లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం రాత్రి పట్ట ణంలోని పార్టీ కార్యాలయంలో పుర అభ్యర్థులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పట్టణంలో రెండేళ్ల వ్యవధిలో రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు గత పాలకుల చేతగానితనం, వైఫల్యాలను గడపగడపకు వివరించాలని సూచించారు. జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై రూ.123 కోట్లతో హైలెవల్ వంతెన పనులు కొనసాగుతున్నాయని, దీనికి అనుసంధానంగా మంత్రాలయం, ఎమ్మిగనూర్ నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని వివరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను పాల్గొన్నారు.


