కొందరికే రుణమాఫీ!
● చేనేత కార్మికుల ఆందోళన
● జిల్లాలో 333 మందికి గాను 101 మందికి మాత్రమే చెల్లింపులు
● రూ. కోటి మాత్రమే విడుదల.. పెండింగ్‌లో రూ.1.27 కోట్లు
● అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న కార్మిక సంఘం నాయకులు
●
అధికారుల నిర్లక్ష్యమే కారణం..
చేనేత కార్మికుల రుణమాఫీ వ్యవహారంలో జౌళీశాఖ అధికారులు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రూ.లక్ష రుణం తీసుకున్న వారి వివరాలను సేకరించకుండా సొసైటీ ద్వారా సిఫారసు చేసిన వ్యక్తుల పేర్లను ఖరారు చేస్తూ రుణమాఫీకి ఎంపిక చేయడం ఎంతవరకు సమంజసం. బ్యాంకు ద్వారా రూ.లక్ష రుణం పొందిన ప్రతి కార్మికుడికి రుణమాఫీ చేయాలి.
– పగడాకుల నర్సింహ,
నేత కార్మికుడు, అమరచింత
అనర్హులకు వర్తింపజేశారు..
నిత్యం చేనేతపై ఆధారపడి జీవిస్తున్న నేతన్నలను దూరం పెట్టి 25 సంవత్సరాలుగా చేనేతకు దూరంగా ఉన్న కార్మికుల పేర్లను రుణమాఫీ కోసం సిఫారసు చేయడం దారుణం. అమరచింతలో 85 మందికి చేనేత రుణమాఫీ వర్తింపజేయగా.. వీరిలో 15 మంది బినామీలు ఉన్నారు. అధికారులు విచారించి అర్హులకు న్యాయం చేయాలి.
– చిలువరి నాగరాజు,
నేత కార్మికుడు, అమరచింత
అమరచింత: చేనేత కార్మికులు బ్యాంకుల్లో తీసుకున్న రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని రెండేళ్ల క్రితం హామీ ఇచ్చింది. ఈ మేరకు అర్హులైన నేతన్నలకు రుణమాఫీ వర్తింపజేయకుండా.. అనర్హుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేశారని చేనేత కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అర్హులైన కార్మికుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం అమరచింత యూనియన్ బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. నేతన్నల ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాకు సుమారు రూ. 2.50 కోట్లు మంజూరు కావాల్సి ఉండగా, కేవలం రూ.కోటి మాత్రమే మంజూరు చేయడంతో చాలా మంది నేతలకు రుణమాఫీ వర్తించలేదన్నారు. అర్హుల రుణాలను మాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. చేనేత, జౌళీశాఖ ఏడీ వచ్చి సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. అనంతరం బ్యాంకు మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలోని అమరచింత, తిపుడంపల్లి, కొత్తకోట, వెల్టూరు, ఘనపురం ప్రాంతాల్లో ఉన్ని కార్మికులతో పాటు మగ్గాలపై జరి చీరలు తయారు నేస్తున్న కార్మికులు ఉన్నారు. వీరిలో 385 మందికి జియోట్యాగ్ నంబర్లు కలిగి ఉండగా.. జాతీయ బ్యాంకుల్లో నేత పనుల పెట్టుబడి కోసం రూ.లక్షలోపు రుణం పొందిన వారు 333 మంది ఉన్నారని జౌళీశాఖ అధికారులు తెలిపారు. వీరందరూ చేనేత రుణమాఫీకి అర్హులని తేల్చి.. పూర్తి వివరాలతో ప్రభుత్వానికి నివేదించారు. అయితే ప్రభుత్వం రూ. 2.50కోట్లు విడుదల చేయాల్సి ఉండగా.. కేవలం రూ. కోటి మాత్రమే విడుదల చేయడంతో 101 మంది కార్మికుల ఖాతాల్లో మాత్రమే రుణమాఫీ డబ్బులు జమ అవుతున్నాయి. అమరచింతలో 85 మంది.. మిగిలిన గ్రామాల్లో 16 మందికి మాత్రమే రుణమాఫీ వర్తించనుంది.
రూ.1.27 కోట్లు రావాల్సి ఉంది..
జిల్లాలో మొత్తం 333 మంది చేనేత కార్మికులు రుణమాఫీకి అర్హులు. వీరికి రూ. 2.50 కోట్లు రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి రూ.కోటి మాత్రమే వచ్చాయి. ఆ నిధులను 101 మంది నేతన్నల ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు తీసుకున్నాం. మరో వారం వ్యవధిలో రూ. 1.27కోట్లు రానున్నాయి. అర్హులందరికీ ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమ చేస్తాం. – గోవిందయ్య, చేనేత, జౌళీశాఖ ఏడీ
కొందరికే రుణమాఫీ!
కొందరికే రుణమాఫీ!
కొందరికే రుణమాఫీ!


