‘ఉపాధి’ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర
అచ్చంపేట/ అచ్చంపేట రూరల్/బల్మూర్: కేంద్ర ప్రభుత్వం మహాత్మగాంధీ ఉపాధి హామీ చట్టా న్ని వీబీజీ రామ్‌జీగా పేరు మార్చి రద్దు చేసే కుట్ర చేస్తోందని, పాత చట్టాన్ని కొనసాగించే వరకు ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. సోమవారం అచ్చంపేట మండలంలోని బుడ్డతండా, బల్మూరు మండలం చెంచుగూడెం గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ ఉపాధి కూలీల డబ్బులు కుదించాలని, దేవుడి పేరుతో గ్రా మీణ ప్రాంత కూలీల కడుపు కొట్టాలని చూస్తున్నార ని ఆరోపించారు. గాంధీ పథకం పేరు మార్చేశారని, మొన్నటి వరకు గ్రామసభలు నిర్వహించి పనులు చేపట్టేవారని.. ఇప్పుడు ప్రధాని చేయాలనుకునే పనులను మాత్రమే పథకంలో ఉంచాలని నిర్ణయించారని ఆరోపించారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన పనులను వారే నిర్ణయించుకోవాలని, ప్రధాని నిర్ణయాలకు ఆమోదం తెలపవద్దని సూచించారు. కూలీలు, ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని అందుకు తాము మద్దతుగా ఉంటామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారని, మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు తమపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడండి
ఈ పోరులో కూలీలు, ప్రజలకు అండగా ఉంటాం
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల
ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్


