అడ్డుకున్న కొద్దీ రెట్టింపు అభివృద్ధి
● మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్‌సైడ్ కావాలి
● రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి
● ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ వెళ్లేందుకు ఎందుకు భయపడుతున్నారని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. కేసీఆర్ విచారణకు హాజరై తన నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు. గతంలో కేవలం డ్రోన్ ఎగరవేస్తేనే రేవంత్‌రెడ్డిని జైలుకు పంపారని.. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారిని ఎలా వదిలేస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజ్‌గౌడ్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆయూబ్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు మహేందర్‌రెడ్డి, అరుణ్‌కుమార్, లక్ష్మీకాంత్‌రెడ్డి, విష్ణు, మోహన్, పరమేశ్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, గంగాధర్‌గౌడ్, భాస్కర్, అనీల్‌గౌడ్, షబ్బీర్, గణేశ్, కలీం, రవికాంత్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూర్/అమరచింత: అభివృద్ధి పనులకు ప్రతిపక్ష నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా రెట్టింపు ఉత్సాహంతో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం ఆత్మకూర్, అమరచింత పట్టణాల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆత్మకూర్ మున్సిపాలిటీలో రెండేళ్ల వ్యవధిలోనే రూ. 15కోట్లు, అమరచింతలో రూ. 50కోట్ల వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. అదే విధంగా రూ. 3.14కోట్లతో పరమేశ్వరస్వామి చెరువు సుందరీకరణ, రూ. 123కోట్లతో జూరాల హైలెవల్ బ్రిడ్జి, రూ. 5కోట్లతో ఇండోర్ స్టేడియం, రూ. 3కోట్లతో డయాలసిస్ కేంద్రం, రూ. 24కోట్లతో 50 పడకల ఆస్పత్రి, రూ. 10 లక్షలతో ఓపెన్ జీమ్, 110 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. అదే విధంగా మండలానికి రూ. 400కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. రానున్న మూడేళ్లలో రూ. 300 కోట్ల నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. జూరాల హైలెవల్ బ్రిడ్జికి అనుసంధానంగా రూ. 210కోట్లతో మంత్రాలయం – ఎమ్మిగనూర్ నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి అనుమతులు వచ్చినట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ ప్రకటన రాబోతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తామని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు. అమరచింతలో పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. అనంతరం రాజవలీ ఉర్సు పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.


