గుర్తుల కేటాయింపులో పొరపాట్లకు తావివ్వొద్దు
వనపర్తి: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై.. అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ, గుర్తుల కేటాయింపుపై పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో భాగంగా నామినేషన్ వేసి పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు స్వయంగా వచ్చి ఉపసంహరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందన్నారు. అలా కాకుండా ప్రతిపాదిత వ్యక్తి లేదా ఏజెంట్ ఉపసంహరణ పత్రం సమర్పించినట్లయితే, అధికారులు తప్పనిసరిగా అభ్యర్థికి ఫోన్‌చేసి నిర్ధారించుకోవడమే కాకుండా పత్రాలపై ఉన్న సంతకాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. నామినేషన్ ఉపసంహరణకు మంగళవారం మధ్యాహ్నం 3గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని.. ఈ సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపసంహరణలు అంగీకరించబడవన్నారు. సాయంత్రం 4గంటలకు అభ్యర్థులతో సమావేశం నిర్వహించి, ఎన్నికల గుర్తులు కేటాయించనున్నట్లు తెలిపారు. అదే విధంగా పోలింగ్, కౌంటింగ్‌కు సంబంధించి అభ్యర్థుల ఏజెంట్లందరికీ అవసరమైన గుర్తింపు కార్డులను సిద్ధం చేయాలన్నారు. ఒక అభ్యర్థికి ఒక ఏజెంట్ మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ తమకు కేటాయించిన హ్యాండ్‌బుక్‌ను క్షుణ్ణంగా చదివి నియమ నిబంధనలు తెలుసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం–12ను వెంటనే సమర్పించాలని సూ చించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యాద య్య, డిప్యూటీ సీఈఓ రామమహేశ్వర్‌రెడ్డి, టీఓటీ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.


