స్ట్రాంగ్‌రూం వద్ద పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

స్ట్రాంగ్‌రూం వద్ద పటిష్ట భద్రత

Feb 12 2026 1:20 PM | Updated on Feb 12 2026 1:20 PM

స్ట్రాంగ్‌రూం వద్ద పటిష్ట భద్రత

స్ట్రాంగ్‌రూం వద్ద పటిష్ట భద్రత

ఏ చిన్న లోపానికి అవకాశం లేదు

ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ సునీతరెడ్డి

వనపర్తి/కొత్తకోట రూరల్‌/అమరచింత/వనపర్తి రూరల్‌: ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా కొనసాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఎస్పీ సునీతరెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలు, కొత్తకోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌, ఓట్ల లెక్కింపు కేంద్రం, అమరచింతలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎస్సీకాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూం, ఓట్ల లెక్కింపు కేంద్రం, పెబ్బేరులోని 1, 10 వార్డులో ఏర్పాటు చేసిన మోడల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. భద్రత ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీసు బందోబస్తు, ప్రవేశ నియంత్రణ చర్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి ప్రాణాధారమని, భద్రతలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు, చట్టవిరుద్ధ ప్రయత్నాలు, గందరగోళానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి అధికారి, సిబ్బంది తమ విధులను అప్రమత్తంగా నిర్వర్తించాలని, చట్టానికి ఎవరూ అతీతులు కారని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడటం పోలీసుశాఖ కర్తవ్యమని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎస్పీ వెంట కొత్తకోట సీఐ రాంబాబు, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, పుర కమిషనర్‌ సైదయ్య, ఎంపీడీఓ వినీత్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ నరేష్‌, రిజర్వ్‌ సీఐలు శ్రీనివాస్‌, కొత్తకోట ఎస్‌ఐ ఆనంద్‌, పోలీస్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌..

ఆత్మకూర్‌: పుర ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయని, ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారని ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ సరళి, కౌంటింగ్‌ కేంద్రం, స్ట్రాంగ్‌రూంను పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని.. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేందుకు సీసీ కెమెరాల పర్యవేక్షణ, సిబ్బంది విధులపై మార్గదర్శకాలు జారీ చేశారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, పుర కమిషనర్‌ చికినె శశిధర్‌, సీఐ శివకుమార్‌, ఎస్‌ఐ జయన్న, తహసీల్దార్‌ చాంద్‌పాషా, ఎంపీడీఓ శ్రీపాద్‌, ఎంఈఓ బాలరాజు, ఎంపీఓ శ్రీరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement