విమర్శల హోరు.. | - | Sakshi
Sakshi News home page

విమర్శల హోరు..

Feb 10 2026 7:17 AM | Updated on Feb 10 2026 7:17 AM

విమర్శల హోరు..

విమర్శల హోరు..

చివరిరోజు హోరెత్తిన కార్నర్‌ మీటింగ్‌లు

ప్రధాన పార్టీల

బలాబలాలు ప్రదర్శన

విమర్శలే ప్రధాన అస్త్రాలుగా నేతల ప్రసంగాలు

ముగిసిన ‘పుర’ ప్రచార పర్వం

వనపర్తి: ఏడు రోజులుగా సాగిన పుర పోరు ప్రచారంలో ప్రధాన పార్టీలైన అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలనే ప్రధాన అస్త్రాలుగా చేసుకున్నారు. ఒకరి లోపాలను మరొకరు ఎత్తిచూపుతూ.. తమ ప్రచారాన్ని హోరెత్తించారు. అయితే ప్రచారానికి చివరి రోజైన సోమవారం ఆ రెండు పార్టీలు భారీ జనసమీకరణతో బలప్రదర్శన చూపించే ప్రయత్నం చేశారు. జిల్లా కేంద్రంలోని రాజమహల్‌ ముఖద్వారం వద్ద అధికార కాంగ్రెస్‌ పార్టీ, అంబేడ్కర్‌ చౌరస్తాలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కార్నర్‌ మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. భారీగా జనసమీకరణ చేసి.. తమ బలప్రదర్శన చూపించే ప్రయత్నం చేశారనే చర్చ స్థానికుల్లో వినిపించింది. కార్నర్‌ మీటింగ్‌లో విమర్శలే ప్రధాన అస్త్రాలుగా నేతల ప్రసంగాలు సాగాయి. ‘‘రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసి.. ఏటా రూ. 75వేల కోట్ల వడ్డీ చెల్లించే దుస్థితి కల్పించారు. మరోసారి వారికి పాలనాధికారం ఇవ్వొద్దు’’ అంటూ రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎస్‌పై ఘాటు విమర్శలు చేశారు. అదే తరహాలో ‘‘ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అధికార కాంగ్రెస్‌ ఘోరంగా విఫలమైంది. మరో రెండున్నరేళ్ల తర్వాత రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అఽధికారంలోకి రాబోతోంది. అప్పుడు మున్సిపల్‌ పాలకవర్గాలు కాంగ్రెస్‌ పార్టీకి చెందినవి ఉంటే.. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తారు. ఈ రెండేళ్ల పాలన బాగుందని.. అందుకే మున్సిపల్‌ పాలనాధికారం ప్రజలు తమకు ఇచ్చారని కాంగ్రెస్‌ పాలకులు హామీలు నెరవేర్చకుండా తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు’’ అంటూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. మొత్తంగా బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే, కార్నర్‌ మీటింగ్‌లతో కొంతసేపు ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. పోలీసులు వాహనాలను దారి మళ్లించినా ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు.

ఎన్నికల నియమావళిని పాటిస్తూ సరిగ్గా 5 గంటలకే ఇరు పార్టీల నేతల ప్రసంగాలను బంద్‌ చేశారు. ఏడు రోజులపాటు మార్మోగిన మైకులు సైలెన్స్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు, తమ మద్దతుదారులు ప్రలోభాల పర్వానికి తెరలేపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement