వలస ఓటర్లకు గాలం
● వారిని ప్రసన్నం చేసుకునేపనిలో అభ్యర్థులు
● నగరాలకు వెళ్లేందుకు సైతం వెనుకాడని వైనం
అమరచింత: మున్సిపాలిటీ ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ వార్డులోని ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారు? ఎవరు నగరాలకు వలస వెళ్లారని విచారిస్తూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలోని పురపాలికల్లో ఓటర్లుగా ఉంటూ బతుకుదెరువు కోసం హైదరాబాద్, ముంబాయి తదితర పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను ఇదివరకే సేకరించారు. ఎవరిని ఆశ్రయిస్తే వారు తమకు మద్దతిస్తారన్న వివరాలు సైతం తీసుకొని వారితో కలిసి అక్కడకు వెళ్తున్నారు. రానుపోను ప్రయాణ ఖర్చులతో పాటు ఓటేసేందుకు సైతం కొంత ముట్టజెప్పే పనుల్లో లీనమయ్యారు. అమరచింతకు చెందిన వారు సుమారు వెయ్యిమందికి పైగా నగరాల్లో నివసిస్తూ ఎన్నికల వేళ గ్రామానికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా 1వ వార్డులోని శివాజీనగర్, 2వ వార్డులోని కొత్తతండా, 6, 10వ వార్డులోని తెలుగుగేరిలో వలస ఓటర్లు అధికంగా ఉన్నారు. అలాగే ఆత్మకూర్, కొత్తకోట, పెబ్బేరు, వనపర్తి పురపాలికల్లో సైతం ఇదేతంతు కొనసాగుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.


