పొరపాట్లకు తావులేకుండా ఓట్ల లెక్కింపు
వనపర్తి: పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దని, అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన కౌంటింగ్ సూపర్‌వైజర్లు, సహాయ సూపర్‌వైజర్ల శిక్షణకు ఆయన హాజరై పలు సూచనలు చేశారు. చెల్లుబాటు అయ్యే.. చెల్లుబాటు కాని ఓట్లను చాలా జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. రిటర్నింగ్ అధికారి ఏదైనా ఓటును చెల్లనిదిగా పరిగణిస్తే తిరిగి తీసుకోకూడదని చెప్పారు. అభ్యర్థులు సరైన కారణాలతో లిఖితపూర్వక నోటీసు ఇచ్చినప్పుడు మాత్రమే రీ–కౌంటింగ్‌పై నిర్ణయం తీసుకోవాలని, తుది నిర్ణయం రిటర్నింగ్ అధికారిదేనని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థి తరఫున ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఎన్నికల నిబంధనలు విధిగా పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో టీఓటీ శ్రీనివాసులు, ఆర్వోలు, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి


