‘కాంగ్రెస్ పాలనలోనే ప్రజలకు స్వేచ్ఛ’
అమరచింత: బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు అశాంతితో బతికారని.. తమ ప్రభుత్వం వచ్చాక స్వేచ్ఛ పొందడంతో పాటు సంక్షేమ పథకాలు అందుకునే స్థాయికి వచ్చారని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ప్రొ. కత్తి వెంకటస్వామి అన్నారు. శనివారం పట్టణంలోని డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్‌ఖాన్ నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మహాత్మాగాంధీ పేరును తూడిచివేయాలనే ఉద్దేశంతో ఉపాధిహమీ పథకం పేరు తొలగించే కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. రాష్‌ట్రంలో కేంద్ర నిధులతోనే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని బీజేపీ నాయకులు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని.. రాష్ట్రానికి నిధులిచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్న విషయం మరిచి మాట్లాడుతున్నారన్నారు. పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి పంపిన వాటాధనంలో కేవలం పదిశాతం కూడా తిరిగి ఇవ్వని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉందని ఆరోపించారు. రెండేళ్ల పాలనలోనే రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందకు తీసుకెళ్లామని.. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో కాస్త జరిగిందని, కేవలం మూడు నెలల వ్యవధిలో సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగులు ఆనందించేలా భారీస్థాయిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అత్యధిక స్థానాలను కై వసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మక్తల్ నియోజకవర్గంలో మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో మూడు మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిస్తున్నారని.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్న విషయం యువత గుర్తించి తమ పార్టీతో పాటు సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, అయ్యూబ్‌ఖాన్, మహేందర్‌రెడ్డి, అరుణ్‌కుమార్, రమేష్, శ్యాం, వెంకటేశ్వర్‌రెడ్డి, పోసిరిగారి విష్ణు, నందిమళ్ల సర్పంచ్ రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


