పకడ్బందీగా పుర ఎన్నికల నిర్వహణ
● పీఓ, ఏపీఓలు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
● రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్
అమరచింత: పుర ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. శుక్రవారం పుర కార్యాలయంలో జరిగిన పీఓ, ఏపీఓల శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ బాధ్యత పీఓ, ఏపీఓలపైనే ఉందని.. బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్‌కు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారని అడిగి తెలుసుకున్నారు. బ్యాలెట్ పత్రాల పరిశీలనలో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని.. ముద్రణలో ఎలాంటి అవాంతరాలు కలగకుండా చూడాలని కోరారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా తగిన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. అదేవిధంగా సిరా చుక్కను ప్రతి ఓటరు వేలికి విధిగా అంటించాలని, అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే అక్కడే ఉన్న భద్రత సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. పోలింగ్ సమయంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రంలో సమయపాలన కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. అనంతరం పుర కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి మున్సిపల్ కమిషనర్‌కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నోడల్ అధికారి శ్రీనివాసులు, తహసీల్దార్ రవికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


