పాలమూరు పద్మం
మహబూబ్‌నగర్‌లోని పాలకొండ వెంకట్‌రాంరెడ్డి, దమయంతి దంపతుల కుమారుడు విజయానంద్ రెడ్డి 1982లో ఉస్మానియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి కొన్ని రోజులపాటు భూత్పూర్ పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత రేడియేషన్ అంకాలజీలో ఎండీ, డీఎన్‌బీ పూర్తి చేసి గత 30 ఏళ్లుగా అపోలో ఆస్పత్రిలోని అంకాలజీ విభాగం ప్రొఫెసర్ హెచ్‌వోడీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య డాక్టర్ శశికళ ఉస్మానియా కళాశాల ప్రిన్సిపాల్‌గా రిటైర్డ్ కాగా.. ఇద్దరు కొడుకులలో ఒకరు వైద్యుడిగా, మరొకరు సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డారు.
పాలమూరు సిగలో మరో పద్మశ్రీ చేరింది. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన కిన్నెర మొగులయ్య, నారాయణపేట జిల్లాకు చెందిన బుర్రవీణ వాయిద్య కారుడు దాసరి కొండప్పలను పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. తాజాగా పాలమూరు నగరంలోని వల్లబ్‌నగర్‌కు చెందిన వైద్యుడు పాలకొండ విజయానంద్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయానంద్‌రెడ్డి గత 44 ఏళ్లుగా వైద్యరంగంలో అందిస్తున్న విశిష్ట సేవలకు ఈ పురస్కారం దక్కిందని కొనియాడారు.
– సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్/ పాలమూరు


