అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు
● అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి
● కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి: ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని.. నవసమాజ నిర్మాణానికి అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టరేట్‌లో 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ ద్వారా కూడా సులభంగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 5.06 లక్షల మంది ఓటర్లు ఉన్నారని.. అందులో సగానికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. మహిళలు ఓటింగ్ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని ఆయన అభినందించారు. మై ఇండియా మై ఓటు అనే ఇతివృత్తంతో జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఓటరు జాబితా తయారీ, ఎన్నికల విధుల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. అదే విధంగా కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లను సన్మానించారు. అంతకుముందు, ఓటర్లలో అవగాహన కల్పించేందుకు మర్రికుంటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ పాఠశాల నుంచి ఐడీఓసీ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించే గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో గణతంత్ర వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. గణతంత్ర దినోత్సవానికి వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పరేడ్ నిర్వహణ, అతిథుల సీటింగ్, జెండా ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, విద్యుత్ సరఫరా, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి, డీపీఆర్‌ఓ సీతారాం, సీఐ కేఎస్.రత్నం, ఎస్‌ఐ హరిప్రసాద్ ఉన్నారు.


