నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం : ఎస్పీ
కొత్తకోట రూరల్: వాహనాలు వేగంగా నడపడం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడంలో నిర్లక్ష్యం వంటి కారణాలతోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఒక్క కుటుంబానికే కాదు.. సమాజానికే తీరని నష్టం కలిగిస్తాయని చెప్పారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో మండలంలోని అప్పారాల సమీపంలో ఉన్న కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీలో కార్మికులు, ఫ్యాక్టరీ ఉద్యోగులు, చెరుకు రవాణా వాహనాల డ్రైవర్ల అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పరిశ్రమల ప్రాంతాల్లో భారీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతుంటాయన్నారు. కార్మికులు విధులు ముగించుకొని సురక్షితంగా ఇంటికి చేరడమే కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. జిల్లావ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడమే లక్ష్యంగా విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఐ రాంబాబు, ఎస్‌ఐ ఆనంద్, షుగర్ ఫ్యాక్టరీ మేనేజర్ రామరాజు, షుగర్ ఫ్యాక్టరీ లీగల్ అడ్వయిజర్ భాస్కర్, పోలీస్ సిబ్బంది, షుగర్ ఫ్యాక్టరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణం : ఎస్పీ


