మెరుగైన విద్య అందించడమే లక్ష్యం
వనపర్తి: సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న మైనార్టీ వర్గాల పిల్లలకు మెరుగైన విద్య అందించడమే తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ లక్ష్యమని టీఎంఆర్‌ఈఐఎస్ కార్యదర్శి షఫీవుల్లా అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులతో వారు ముఖాముఖి నిర్వహించి, విద్యా ప్రమాణాలను తెలుసుకున్నారు. అనంతరం షఫీవుల్లా మాట్లాడుతూ.. ఇంటర్ తర్వాత నిర్వహించే వివిధ పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన ఉండాలన్నారు. ప్రభుత్వం రెసిడెన్షియల్ సొసైటీ ద్వారా మంచి సదుపాయాలను కల్పిస్తోందని, విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలు నిర్దేశించుకొని నిరంతరం కష్టపడాలని సూచించారు. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ సొసైటీ పరిధిలోని అన్ని పాఠశాలలు కళాశాలల్లో వందశాతం అడ్మిషన్లు అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
● కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యాసంస్థల కన్నా ప్రభుత్వ రెసిడెన్షియల్ సొసైటీల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందుతోందన్నారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. అనంతరం తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ సొసైటీ పాఠశాలలు, కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్, ఆర్‌ఎల్‌సీ ఖాజా, కళాశాల ప్రిన్సిపాల్ హవిలారాణి పాల్గొన్నారు.


