పకడ్బందీగా నామినేషన్ల స్క్రూటినీ
వనపర్తి: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం సాయంత్రం ముగియగా శనివారం స్క్రూటినీ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. నామినేషన్ తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఫిబ్రవరి 1న ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవచ్చని సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి పుర కమిషనర్లు, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. గదిలోకి ఎంతమందిని అనుమతించాలనే విషయాలను వివరించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య పాల్గొన్నారు.
ఎన్నికల సామగ్రి పంపిణీకి పక్కా ఏర్పాట్లు..
అమరచింత/ఆత్మకూర్: పుర ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం అమరచింత పుర కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రం, జెడ్పీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలు, అలాగే ఆత్మకూర్‌లోని ఎన్నికల సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్‌రూం, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రిటర్నింగ్ అధికారులు పబ్లిష్ చేసిన ఎన్నికల నోటీసు ఫారం–1ను పరిశీలించారు. స్వీకరించిన నామినేషన్ల వివరాలను ఎప్పటికప్పుడు టీ–పోల్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్నారు.
కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్‌రూం తనిఖీ..
అమరచింత ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సామగ్రి పంపిణీ, సేకరణ, ఓట్ల లెక్కింపు కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ తనిఖీ చేశారు. సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ కోసం తగిన ఏర్పాట్లను ఫిబ్రవరి 9 సాయంత్రంలోగా పూర్తి చేయాలన్నారు. రూట్ల వారీగా టెంట్లువేసి వార్డుకో టేబుల్ చొప్పున ఏర్పాట్లు ఉండాలని సూచించారు. విశాల ప్రదేశంలో సులువుగా అర్థమయ్యేలా ఫ్లెక్సీలు కనిపించాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో అవసరమైన అన్ని వసతులు కల్పించాలని.. పటిష్టమైన బారికేడ్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శివకుమార్, అమరచింత తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ శ్రీనివాసులు, పుర కమిషనర్ నూరుల్ నదీం, ఆత్మకూర్ పుర కమిషనర్ చికినే శశిధర్, తహశీల్దార్ చాంద్‌పాషా, ఎంపీడీఓ శ్రీపాద్ ఉన్నారు.


