రాష్ట్ర ప్రయోజనాలకు కాంగ్రెస్ తూట్లు
● పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు
● శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్
వనపర్తిటౌన్: బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు నాయకులు, కార్యకర్తలు ఐక్యమత్యంతో పని చేయాలని శాసనమండలి మాజీ చైర్మన్, పుర ఎన్నికల ఇన్‌చార్జ్ స్వామిగౌడ్ కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు రమేష్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆంధ్ర పాలకుల తొత్తుగా మారి తెలంగాణ ప్రయోజనాలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. పుర ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి వివరించి ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని, టికెట్ రాలేదని నిరాశ చెందకుండా అవకాశం కోసం వేచి ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలుచేయకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి, తీవ్ర వ్యతిరేకత ఉందని.. పుర ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారాని తెలిపారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. హస్తానికి ప్రజల అండ లేదని, మున్సిపల్ ఎన్నికలతో హస్తం అస్తమిస్తోందని జోస్యం చెప్పారు. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అంతర్గత సర్వే నిర్వహిస్తోందని, విశ్వాసం, విధేయత, కార్యకర్తల ఏకాభిప్రాయం మేరకే అభ్యర్థులను నిలబెడతామని చెప్పారు. టికెట్ పొందిన అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్‌కు మన తరఫున బహుమతి ఇద్దామని ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు జిల్లాకేంద్రం నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, కె.మాణిక్యం, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


