కాంట్రాక్టు, ఏజెన్సీల వ్యవస్థను రద్దు చేయాలి
వనపర్తి రూరల్/ఖిల్లాఘనపురం: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత లేక శ్రమ, ఆర్థిక దోపిడీకి గురవుతున్నారని.. వెంటనే ఆయా వ్యవస్థను రద్దు చేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సురేశ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణ, ఖిల్లా ఘనపురంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కార్మికులు, సిబ్బందితో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించి కార్మికులతో మాట్లాడారు. కనీస వేతనం రూ.26 చెల్లించి వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.15 లక్షలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొనసాగుతున్న ఏజెన్సీల మూడేళ్ల కాలవ్యవధి ముగిసి దాదాపు పది నెలలు గడుస్తోందని.. కొత్త టెండర్ల ప్రక్రియ కాలయాపనతో తీవ్రమైన పనిభారంతో పాటు ఆర్థికంగా కార్మికులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీల విధానాన్ని రద్దుచేసి ప్రభుత్వమే కార్పొరేషన్ ద్వారా నేరుగా వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సూపర్‌వైజర్లు థర్డ్‌పార్టీ ఏజెన్సీల కింద ఎలాంటి ఉద్యోగ భద్రతకు నోచుకోవడం లేదన్నారు. ఖిల్లాఘనపురంలో జరిగిన కార్యక్రమంలో మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆస్పత్రి బ్రాంచ్ నేతలు, కార్మికులు సాయికృష్ణ, నాగన్న, వెంకటేష్, మునీందర్, భీమయ్య, నజ్మా, రంగమ్మ, వనపర్తిలో జరిగిన కార్యక్రమంలో నాయకులు గోపాలకృష్ణ, గంధం శ్రీనివాస్, నర్సింహ, నరేందర్, భరత్, రాజేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


