రైతులను మోసం చేసిన బీఆర్‌ఎస్
వనపర్తిటౌన్: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రైతుల పేరుతో ఎన్నో మోసాలు చేశారని.. రైతులను మోసం చేసిన పార్టీకి భవిష్యత్ ఉండదని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. శనివారం వనపర్తి మండల రైతువేదికలో రైతులకు రాయితీపై వ్యవసాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి రైతు పక్షపాతిగా పనిచేస్తోందన్నారు. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు, రాయితీలను అందిస్తోందన్నారు. గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో రైతులకు రూ.లక్షలు ఆదా అయ్యే వ్యవసాయ ఉపకరణాలపై రాయితీలను ఎత్తేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన ప్రాజెక్టులకు బొక్కలుపెట్టి నీళ్లు తెచ్చామని గొప్పలు చెబుకున్నారని దుయ్యబట్టారు.
● జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి హాజరై మాట్లాడారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి 40 మందికి పైగా సర్పంచులు యువకులేనని.. పార్టీ యువకులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువకులకు సర్వేల ఆధారంగా అవకాశం ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ చేస్తున్న దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో వీధి దీపాలను ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, మురళీధర్‌రెడ్డి, సాయిచరణ్‌రెడ్డి, శారద, సయ్యద్ ఖలీద్, మాజీద్, ఆదిత్య, శివాంత్‌రెడ్డి, సుకన్య పాల్గొన్నారు.


