ప్రజా సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
కొత్తకోట రూరల్: రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తకోట మండలం వడ్డెవాట, భూత్కూర్, నాటవెళ్లి పెద్దతండా గ్రామాల్లో నూతనంగా నిర్మించిన పంచాయతీ, మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామస్థాయిలో మహిళల ఆర్థికాభివృద్ధికి మహిళా సమాఖ్య భవనాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అనంతరం వడ్డెవాటలో రెడ్డి అసోసియేషన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వడ్డేవాటకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరగా.. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, మాజీ సర్పంచ్ శేఖర్‌రెడ్డి, పి.కృష్ణారెడ్డి, బోయేజ్, భానుప్రకాశ్‌రెడ్డి, సర్పంచులు మండ్ల రాములు, బంగారయ్య, పాండునాయక్ పాల్గొన్నారు.


