ఎన్నికల ఖర్చు లెక్క చూపాల్సిందే..
అమరచింత: పుర బరిలో నిలిచిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చులను విధిగా రాసి లెక్క చూపాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు ఎం.శ్రీనివాసులు తెలిపారు. స్థానిక పుర కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి అభ్యర్థి సుమారు రూ.లక్ష వరకు ఖర్చు చేయాల్సి ఉందని.. రూ.5 వేల పైబడి ఖర్చు చేస్తే అందుకు సంబంధించి డిజిటల్ పెమెంట్ లేదా చెక్కు రూపంలో చెల్లించాలని సూచించారు. కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతాలో ముందుగా రూ.లక్ష డిపాజిట్ చేసి అందులో నుంచే ఖర్చు చేయాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతి లెక్కను ఎన్నికల ఖర్చు ఫారంలో నమోదు చేయాలని, వాటి బిల్లులు సైతం జత చేయాల్సి ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో వ్యయ పరిశీలకుడు మహ్మద్ యూసుఫ్, పుర కమిషనర్ నూరుల్ నదీం తదితరులు పాల్గొన్నారు.


