నోడల్ అధికారుల పాత్ర కీలకం
వనపర్తి: మున్సిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఎన్నికల నోడల్ అధికారుల సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి కలెక్టర్ పాల్గొని పలు సూచనలు చేశారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిందని, కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా పాటించేలా డీఆర్డీఓ ఉమాదేవి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు నివేదికలు పంపాల్సి ఉంటుందని తెలిపారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ అనంతరం వాటిని పోలీసు రక్షణలో తీసుకొచ్చే బాధ్యతను మత్స్యశాఖ అధికారి లక్ష్మప్పకు అప్పగించారు. నోడల్ అధికారులు తమకు కేటాయించిన విభాగాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నిబంధనలను క్షుణ్ణంగా చదవాలని, ఏవైనా సందేహాలుంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి సకాలంలో ఉత్తర్వులు అందజేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఎఫ్‌ఎన్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలకు వాహనాలతో పాటు ఎన్నికల సామగ్రి తరలించేందుకు కావాల్సిన రవాణా సౌకర్యాలను సమకూర్చాలని జిల్లా రవాణాశాఖ అధికారికి సూచించారు. అదేవిధంగా నోడల్ అధికారులు తమ కార్యాలయాల్లో ఉన్న రాజకీయ సంబంధిత చిహ్నాలు, పోస్టర్లు తొలగించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఈఓ రామమహేశ్వర్, డీపీఆర్‌ఓ సీతారాం, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అఫ్జలుద్దీన్, డీటీఓ మానస తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఉండాలి
పుర ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని.. రాజకీయ పార్టీల ప్రతినిధులు నియమావళి, నిబంధనలకు కట్టుబడి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు ముందస్తుగా తహసీల్దార్ నుంచి అనుమతి తీసుకోవాలని, సంబంధిత రాజకీయ పార్టీల అభ్యర్థులు నామినేషన్ విత్‌డ్రా చేసుకునే నాటి వరకు ఫారం–బి సమర్పించేలా చూసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు.


