హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
అమరచింత/ఆత్మకూర్/కొత్తకోట: బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదని, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటన నడుస్తోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకె అరుణ మండిపడ్డారు. మున్సిపాలిటీ ఎన్నికలను పురస్కరించుకొని శుక్రవారం అమరచింత, ఆత్మకూర్, కొత్తకోట, వనపర్తిలో నిర్వహించిన రోడ్‌షో, కార్నర్ మీటింగ్‌లో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పింఛన్ రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని చెప్పి మాట తప్పిందన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడ పిల్లలకు రూ.2,500, కల్యాణలక్ష్మి రూ.లక్షతో పాటు తులం బంగారం, నిరుద్యోగులకు రూ.4 వేల భృతి తదితర హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను వినియోగించుకుంటున్న విషయాన్ని గ్రామస్థాయిలో వివరించాలన్నారు. పురపాలికలకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ రూ.వేల కోట్లు మంజూరు చేస్తుంటే వాటిని దారి మళ్లించి ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానివని చెప్పుకోవడం వింతగా ఉందని తెలిపారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని పురపాలికల్లో తాగునీటి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి వాకిటి శ్రీహరి హాజరుకాలేదని.. ఇప్పుడు జరుగుతున్న పనులు రాష్ట్ర నిధులతో చేపడుతున్నామని చెప్పుకోవడం అవివేకమన్నారు. పుర ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఆత్మకూర్, అమరచింతలో హడావుడిగా చెరువుల సుందరీకరణ పనులు చేపట్టేందుకు నిర్ణయించారని, రాత్రికిరాత్రే శిలా ఫలకాలు తీసుకొచ్చి వాటిపై ఎంపీ పేరు లేకుండానే శంకుస్థాపన చేయడం దారుణమన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు 2047 లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. పురపాలికలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించి జెండా ఎగురవేయాలని కోరారు. అమరచింతలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, ఎన్నికల ఇన్‌చార్జ్ వెంకటేశ్వర్లు, నరాల నారాయణ, మేర్వ రాజు, మంగ లావణ్య, అశోక్, భాస్కర్, ఆత్మకూర్‌లో జరిగిన కార్యక్రమంలో అశ్విన్‌కుమార్, జిందె శ్రీనివాస్, మహేశ్వరి, తమ్మలి విజయ్, ఆనంద్, లక్ష్మీకాంత్, జిందె జ్యోతి పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ ఎంపీ
డీకే అరుణ


