ఈసీ నిబంధనలు విధిగా పాటించాలి
వనపర్తిటౌన్: ఎన్నికల సంఘం నిబంధనలు విధిగా పాటిస్తూ పకడ్బందీగా పుర ఎన్నికల విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ నెల 11న జరగనున్న పుర ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా.. ఆమె హాజరై పలు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఏవైనా సందేహాలుంటే మాస్టర్ ట్రైనర్లతో నివృత్తి చేసుకోవాలని, పోలింగ్ రోజు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని సూచించారు. పోలింగ్‌కు ముందురోజు సిబ్బంది కచ్చితంగా కేటాయించిన కేంద్రంలోనే రాత్రి బస చేయాలని పేర్కొన్నారు. అలాగే టెండర్ ఓటుపై అవగాహన కల్పించారు. పోస్టల్ బ్యాలెట్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని, ఓటర్లు తమ వెంట కచ్చితంగా గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో కొనసాగుతున్నందున అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. కార్యక్రమంలో శిక్షణ నోడల్ అధికారి రామమహేశ్వరరెడ్డి, మున్సిపల్ డీఈ మహ్మద్ యూనూస్, డీపీఓ రఘునాథ్‌రెడ్డి, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్‌తో మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం
వనపర్తి: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)తో మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్‌న్స్ నిర్వహించగా.. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 63.22 శాతం పూర్తయిందని.. ప్రక్రియను మరింత వేగవంతం చేసి లక్ష్యాన్ని చేరుకుంటామని వివరించారు.ప్రతి బీఎల్వో 30 నుంచి 40 మందిని మ్యాపింగ్ చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. సమావేశంలో తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


