అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
ఆత్మకూర్: బీఆర్‌ఎస్ హయాంలో ప్రజాప్రతినిధులు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు చూసి పుర ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. బుధవారం రాత్రి మంత్రి నివాసంలో స్థానిక పురపాలికకు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు దండు శ్రీను ఆధ్వర్యంలో పలువురు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌పార్టీలో చేరగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలకులు ఆత్మకూర్‌కు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 300 ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. అలాగే రూ.3.14 కోట్లతో చెరువుకట్ట విస్తరణ, సుందరీకరణ పనులతో పాటు రూ.15 కోట్లతో వార్డుల్లో సీసీ రహదారులు, డ్రైనేజీలు, రూ.123 కోట్లతో కృష్ణానదిపై హైలెవల్ వంతెన నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. పుర ఎన్నికల్లో 10 వార్డుల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, మరింత అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు గంగాధర్‌గౌడ్, పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, భాస్కర్, దామోదర్, మహేష్, సాయిరాఘవ, షాలం, జుబేర్, కరణ్‌లాల్, జహంగీర్, వెంకటన్న తదితరులు పాల్గొన్నారు.


