Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu TDP coalition government abolished MDU system1
బియ్యం బండి ఆగింది.. మీ రేషన్‌ మీరే తెచ్చుకోండి

సాక్షి, అమరావతి: పనులు మానుకుని రోజంతా రేషన్‌ డిపోల దగ్గర పడిగాపులు.. బియ్యం కోసం క్యూ లైన్లో కుస్తీలు.. ఎండైనా, వానైనా అరుగులపై కూలబడి అవస్థలు.. తీరా సర్వర్లు మొరాయించడంతో ఉసూరుమంటూ ఇంటి ముఖం పట్టిన దుర్భర దృశ్యాలు రాష్ట్రంలో పునరావృతం కానున్నాయి! వీధివీధినా బెల్టు షాపుల ఏర్పాటుతో ఊరూరా మద్యపుటేరులు పారిస్తున్న టీడీపీ కూటమి సర్కారు ఇప్పటికే రేషన్‌ డోర్‌ డెలివరీ వ్యవస్థను నీరుగార్చగా, తాజాగా పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. ప్రజల అవస్థలను తొలగిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక వ్యవస్థ ‘ఇంటి వద్దకే రేషన్‌’ను చంద్రబాబు సర్కార్‌ కక్షపూరితంగా రద్దు చేసింది. ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కుతూ రాజకీయ దురుద్దేశాలతో ఏకపక్షంగా ‘ఎండీయూ’ వ్యవస్థను తొలగించింది. కేవలం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టారనే దుగ్ధతో, వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణలను జీర్ణించుకోలేక కోట్లాది మంది పేదలకు సేవలందిస్తున్న ఎండీయూలపై విషం చిమ్ముతూ ఆ వ్యవస్థకే మంగళం పాడేసింది. ఇకపై మీ రేషన్‌.. మీరే తెచ్చుకోండి..! అంటూ ప్రజలను నిలువునా మోసం చేసింది. బాబు ఆగమనం.. రాష్ట్రం తిరోగమనం! టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయాల వ్యవస్థను నిర్వీర్యం చేసి, వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేస్తూ తిరోగమన పాలనకు శ్రీకారం చుట్టింది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సమయంలో.. దేశం మెచ్చిన ఎండీయూ వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చేసింది. సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన అంటూ ఊకదంపుడు ఉపన్యా­సా­లతో అరచేతిలో వైకుంఠం చూపించే సీఎం చంద్రబాబు అండ్‌ కో ఉన్న ఉద్యోగాలే ఊడగొడుతోంది. మొన్న... 2.66 లక్షల వలంటీర్ల కుటుంబాలు.. నేడు 9,260 మంది ఎండీయూ ఆపరేటర్ల కుటుంబాలు, వారిపై ఆధారపడి ఉపాధి పొందుతున్న మరో పది వేల మంది హెల్పర్ల కుటుంబాలను నడిరోడ్డు పైకి లాగేశారు. రాష్ట్రంలో 29,500 రేషన్‌ దుకాణాల వద్దకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవడానికి నానా ప్రయాసలు పడిన ప్రజలకు సాంత్వన చేకూరుస్తూ గత ప్రభుత్వం తెచ్చిన ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్‌ విధానాన్ని చంద్రబాబు భారీ ఆర్థిక భారంగా చిత్రీకరించారు. పేదల ఇంటికి ప్రభుత్వ సేవలు చేరుతుంటే దాన్ని అనవసర భారంగా ముద్రవేశారు. మళ్లీ కూలి మానుకునే దుస్థితి.. గత ప్రభుత్వంలో ఎండీయూ వాహనం ఇంటికి వచ్చే ముందు వలంటీర్‌ ద్వారా నిర్ణీత సమయం, తేదీతో సహా లబ్ధిదారులకు సందేశం వెళ్లేది. ఇంటి యజమానే కాకుండా కార్డుదారుల్లో ఏ వ్యక్తి ఉన్నా బియ్యం ఇచ్చేవారు. రేషన్‌ బియ్యం కోసం ఏ ఒక్కరూ పనులు మానుకుని ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు రేషన్‌ కోసం కూలి పనులు మానుకుని ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది కార్డుదారులు ఉండగా వీరిలో అత్యధికం రోజువారీ పనులు చేసుకుని జీవించేవారే. వీరంతా రూ.300 – రూ.500 రోజు కూలీని నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. వీరిలో సగటున కోటి మంది రేషన్‌ తీసుకోవడానికి డిపోకు వెళితే ఆ రోజు పనికి దూరం కాక తప్పదు. అంటే ఒక నెలలో ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ తీసుకోవడానికి పేదలు రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లు నష్టపోవాల్సిన పరిస్థితి. ఇక ఏడాదికి రూ.3,600 కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు నష్టపోనున్నారు. పోనీ వెళ్లిన రోజే రేషన్‌ వస్తుందా అంటే అదీ లేదు. చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో అనుభవాలే దీనికి నిదర్శనం. నెలకు కేవలం రూ.25 కోట్లతో సమర్థంగా నిర్వహించే ఎండీయూ వ్యవస్థను ఆర్థిక భారంగా పరిగణిస్తూ కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. ఒకవైపు 60 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్‌ ఇస్తుంటే.. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్‌ సరుకులు ఇంటికి పంపిస్తామంటూ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఎవరి సహాయంతో రేషన్‌ డోర్‌ డెలివరీ చేస్తారో చెప్పకపోవడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎండీయూలపై నేర ముద్ర.. గతంలో చౌక దుకాణాలపై కేసుల్లేవా! ఓ విప్లవాత్మక వ్యవస్థను నిర్వీర్యం చేయాలంటే నిందారోపణలు చేయాలి. ఇదే చంద్రబాబు సర్కార్‌ స్ట్రాటజీ! అందులో భాగంగానే ఎన్నికల ముందు నుంచే రేషన్‌ అక్రమ రవాణాకు కేరాఫ్‌ అంటూఎండీయూ వ్యవస్థపై గోబెల్స్‌ ప్రచారం సాగించారు. రేషన్‌ అక్రమ రవాణా మొత్తం ఎండీయూల చేతుల్లోనే జరుగుతోందంటూ హీనాతిహీనంగా మాట్లాడారు. వాస్తవానికి ఎండీయూ ఆపరేటర్లు అంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువతే. వీరంతా సొంతూరిలో సగౌరవంగా తలెత్తుకుని జీవించేలా, సొంత కాళ్లపై నిలబడేలా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 90 శాతం రాయితీతో వాహనాలను అందించి ఉపాధి కల్పించింది. తద్వారా సామాజిక న్యాయం, సాధికారతకు బాటలు వేసింది. ఎండీయూలకు ఆర్థిక ఊరట కల్పించేందుకు వాహన మిత్ర పథకంలో భాగంగా ఏడాదికి రూ.10 వేలు చొప్పున అందించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎండీయూలపై అక్రమ రవాణాదారులుగా నిందలు మోపింది. 9,260 ఎండీయూ వాహనాల్లో ఇప్పటి వరకు 288 ఆపరేటర్లపై బియ్యం అక్రమ రవాణా కేసులు పెట్టామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మంగళవారం మీడియా ముఖంగా చెప్పారు. అంటే దాదాపు 9 వేల వాహనాలు సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నట్టే కదా? పోనీ గతంలో చౌక ధరల దుకాణదారులపై రేషన్‌ బియ్యం అక్రమ నిల్వ, అక్రమ రవాణా కేసులు లేవా అంటే కోకొల్లలుగా ఉన్నాయి. వ్యవస్థల్లో లోపాలు ఎక్కడైనా సహజంగా ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ పాలన సాగించాల్సిన ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ప్రజా ప్రయోజనకారిగా ఉన్న వ్యవస్థలను శాశ్వతంగా తొలగించడం అవివేకం కాక మరేమిటన్నది ప్రశ్న? ఇక రేషన్‌ డీలర్‌ అందుబాటులో లేకపోతే ఆ నెలలో సరుకులు కచ్చితంగా ఆలస్యం అవుతాయి. కానీ ఎక్కడైనా ఎండీయూ ఆపరేటర్‌ సెలవులో ఉన్నా, అనివార్య కారణాలతో రాకున్నా వీఆర్‌వో ద్వారా లబ్ధిదారులు ఇంటి వద్దే సరుకులు పొందేలా గత ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఎండీయూ వాహన ఆపరేటర్ల పోస్టు ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేయడంతో పాటు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ప్రాతిపదికపైన నియమించి నిత్యావసరాలను సరఫరా చేసింది. గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఎండీయూ వాహనాలు వెళ్లడం కష్టంతో కూడుకున్నది. ఈ పరిస్థితుల్లో అదనపు ఖర్చు చేసి ఇతర వాహనాల్లో లబ్ధిదారుల ఇళ్లకు రేషన్‌ చేరవేసింది. ఆసక్తి చూపిన ఎనిమిది రాష్ట్రాలు.. రేషన్‌ పంపిణీలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. 2021లో రూ.530 కోట్లకు పైగా వ్యయంతో ‘ఇంటి వద్దకే రేషన్‌’ వ్యవస్థను తీసుకొచ్చింది. నాణ్యమైన సార్టెక్స్‌ బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి ముంగిటికే వాహనాల ద్వారా (ఎండీయూ) డోర్‌ డెలివరీ చేయడంతో పాటు ఐసీడీఎస్‌(అంగన్‌వాడీలు), మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలలకు, సంక్షేమ హాస్టళ్లకు కూడా ఫోరి్టఫైడ్‌ బియ్యాన్ని నేరుగా సరఫరా చేసింది. దీంతో అంగన్‌వాడీలు, పాఠశాలలకు వ్యయ ప్రయాసలు తొలగిపోయాయి. గోదావరి వరదలు, విజయవాడ వరదలు లాంటి విపత్తుల సమయంలోనూ ఎండీయూలే సమర్థంగా సేవలందించాయి. ఇలా ఓ వ్యవస్థను వివిధ ప్రభుత్వ సేవలకు వినియోగించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు దాన్ని విస్మరించి ఏకపక్షంగా రద్దు చేయడం సిగ్గుచేటు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండీయూ వ్యవస్థ వచ్చిన తర్వాత రేషన్‌ వినియోగం పారదర్శకంగా 90 శాతానికిపైగా పెరిగింది. దేశంలో 8 రాష్ట్రాలకు పైగా రేషన్‌ డోర్‌ డెలివరీపై ఆసక్తి కనబరిచాయి.అధికారంలోకి రాగానే అడ్డుకున్న కూటమి ఎమ్మెల్యేలు.. రాష్ట్రంలో 1.45 కోట్ల మంది రేషన్‌ కార్డుదారులకు ఎండీయూ వ్యవస్థ ద్వారా సమర్థంగా నాణ్యమైన బియ్యం పంపిణీ జరుగుతోంది. ఒక్కో ఎండీయూ వాహనం రోజుకు 90 కార్డులకు తగ్గకుండా నెలలో 17 రోజుల పాటు ఇంటి వద్దకే వెళ్లి రేషన్‌ను చేరవేస్తోంది. కల్తీకి ఆస్కారం లేకుండా, కచ్చితమైన తూకంతో ప్రజల సమక్షంలో బియ్యాన్ని ఇంటి ముంగిట్లో అందజేస్తోంది. వివిధ కారణాలతో ఇంటి దగ్గర ఎవరైనా రేషన్‌ తీసుకోకుంటే సాయంత్రం పూట గ్రామ, వార్డు సచివాలయం వద్ద ఇచ్చేలా వెసులుబాటు ఉంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యల్లో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికీ సార్టెక్స్‌ బియ్యాన్ని సరఫరా చేసింది. ఈ క్రమంలో ఎక్కడా రేషన్‌ డీలర్ల ఉపాధికి ఎటువంటి ఆటంకం ఏర్పడలేదు. కేవలం ప్రజల దగ్గరకే ప్రభుత్వ సేవలు చేరువయ్యాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం పేరుతో ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీని నిలిపివేసింది. అధికారంలోకి రాగానే కూటమి పార్టీల ఎమ్మెల్యేలు 2 వేలకుపైగా ఎండీయూ వాహనాలను బలవంతంగా నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో చౌక ధరల దుకాణాల్లోకి వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవాలని హుకుం జారీ చేశారు. పేదల ఇంటికి రేషన్‌ వద్దు... మద్యం ముద్దుపేదల ఇంటికి రేషన్‌ వద్దు గానీ మద్యం మాత్రం ముద్దు అనే రీతిలో టీడీపీ కూటమి సర్కారు చర్యలున్నాయి. బెల్ట్‌ షాపులతో ప్రతీ గ్రామంలో మద్యం డోర్‌ డెలివరీ చేస్తూ ఇంటివద్దకే రేషన్‌ను మాత్రం అదనపు వ్యయంగా చిత్రీకరిస్తోంది.2027 వరకు ఒప్పందం గడువు ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి ఆ వాహనాలను ఆపరేటర్లకు ఉచితంగా ఇస్తామంటూ మంత్రి నాదెండ్ల ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఎండీయూ అసోసియేషన్లు, చౌక ధరల దుకాణదారుల అసోసియేషన్ల సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే దీనిపై విధివిధానాలు ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. 2027 వరకు ఒప్పందం గడువు ఉన్నందున మధ్యలో ఎలా వెళ్లగొడతారని ఎండీయూ అసోసియేషన్‌ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. అర్ధంతరంగా ఎండీయూలను నిలిపివేస్తే తాము ఉపాధి కోల్పోవడంతోపాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని విన్నవించినా ప్రభుత్వం ఆలకించలేదు. తమకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు లేకుండా ఎన్‌వోసీ ఇచ్చిన తర్వాతే రద్దుపై నిర్ణయం తీసుకోవాలని, అప్పటి వరకు ఎండీయూలను కొనసాగించాల్సిందేనని తేల్చిచెప్పారు. రోడ్డుపై వదిలేస్తాం అంటే ఊరుకోముఎండీయూ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే మాకు 72 నెలలకు అగ్రిమెంట్‌ చేశారు. 2027 జనవరి వరకు సమయం ఉంది. ఇంకా సుమారు 20 నెలలు కొనసాగే హక్కు మాకు ఉంది. ఇన్నేళ్లుగా మా సేవలను వినియోగించుకుని ఇప్పుడేదో ఉచితంగా వాహనం ఇచ్చేస్తున్నట్లు మాట్లాడటం సరికాదు. మాకేమైనా దానధర్మం చేస్తున్నారా? మేం పని చేయలేదా? ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రోడ్డుపై వదిలేస్తామంటే చూస్తూ ఊరుకోం. బుధవారం నుంచి మా కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం మాకు ఏం ఉపాధి చూపిస్తారో చెప్పాలి. స్పందించకుంటే న్యాయ స్థానాన్ని ఆశ్రయించడానికి కూడా వెనుకాడబోం. మాకు న్యాయం చేయకుండా డీలర్ల ద్వారా రేషన్‌ పంపిణీ ఎలా చేస్తారో చూస్తాం. ముందుగా మాకు బ్యాంకుల నుంచి ఎన్‌వోసీ ఇప్పించి జీవనోపాధి చూపించాలి. – రౌతు సూర్యనారాయణ, ఎండీయూ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడుఇబ్బంది లేకుండా సరుకులు తీసుకున్నాంఇంటి ముందుకే రేషన్‌ వాహనం రావడం వల్ల ఇబ్బంది లేకుండా సరుకు­లు తీసుకున్నాం. ఐదేళ్లు ప్రశాంతంగా ఇంటి ముందుకే వచ్చాయి. ఇప్పుడు వాహనాలు రావంటే మాలాంటోళ్లం ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా ఇంటి నుంచి రేషన్‌ షాపు అర కిలోమీటరు దూరంలో ఉంది. అంత దూరం నడిచి వెళ్లి క్యూలో నిలబడాలి. డీలర్‌ ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి. వేలిముద్రలు పడకపోతే గంటల తరబడి నిలబడాలి. మమ్మల్ని ఇన్ని కష్టాలు పెడితే ఈ ప్రభుత్వానికి ఏం వస్తుంది? – దారుకుమల్లి వెంకటసుబ్బమ్మ, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా గిరిజనులకు ఎంతోమేలు జరిగింది గతంలో గిరిజనులంతా నిత్యావసరాలు పొందేందుకు అవస్థలు పడ్డారు. గత ప్రభుత్వం ఎండీయూ వాహ­నాలతో ఇంటింటికి బియ్యం, ఇతర నిత్యావసరాల పంపిణీని ప్రారంభించి గిరిజనులకు ఎంతో మేలు చేసింది. కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేస్తే 3 కి.మీ. దూరంలో ఉన్న మినుములూరు డీఆర్‌ డిపో నుంచి సరుకులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. –పాలికి లక్కు, గిరిజనుడు, గుర్రగరువు గ్రామం, మినుములూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా మాగ్రామంలో రేషన్‌ షాపు లేదు మా గ్రామంలో రేషన్‌ షాపు లేదు. మూడు కి.మీ. దూరంలో ఉన్న బురాందొడ్డికి వెళ్లి బియ్యం, ఇతర రేషన్‌ సరుకులు తెచ్చుకునేవాళ్లం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాకు రేషన్‌ కష్టాలు తొలిగాయి. ఇంటి దగ్గరకే రేషన్‌ బండి వచ్చింది. ఇప్పుడు వాటిని తీసి వేస్తే మళ్లీ బియ్యం సంచి నెత్తిన మోయాల్సిందే. చంద్రబాబు పుణ్యమా అని పాత కష్టాలు పునరావృతమవుతున్నాయి. – రహేలమ్మ, బ్యాతోలి గ్రామం, సీబెళగల్‌ మండలం, కర్నూలు జిల్లా

YS Jagan Fires on TDP Govt Over Red Book Politics2
హామీలు గాలికి.. కుట్రలు తెరపైకి..: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికలప్పుడు ఇచ్చిన సూపర్‌ సిక్స్, ఇతర హామీలు అమలు చేయకపోగా ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవస్థ­లన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారని, ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదని.. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు పెచ్చుమీరిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రెడ్‌బుక్‌ కుట్రలతో విధ్వంసం సృష్టిస్తున్నారని, బరితెగించి యథేచ్ఛగా కేసుల మీద కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని.. మనం రాక్షస యుగంలో ఉన్నామని, చంద్రబాబు పాలనలో రాజకీయాలు నైతికంగా పతనం అయ్యాయన్నారు. అయితే ఈ అక్రమ కేసులు, అరెస్టుల పర్వానికి భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు తేల్చి చెప్పారు. జైళ్లకు పంపినా సరే.. ‘చంద్ర­బాబూ.. నిన్ను ఎదుర్కొంటాం’ అని ధైర్యంగా, గట్టిగా నిలబ­డగలిగినప్పుడే రాష్ట్రంలో రాజకీయం చేయగలమని స్పష్టం చేశారు.ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీ­పురం మున్సిపాలిటీ, పశ్చిమ గోదా­వరి జిల్లా పాల­కొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం, శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామ­గిరి మండలం, గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొ­రేషన్‌కు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావే­శ­మ­య్యారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై చర్చించి.. పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్‌సీపీకి కార్యకర్తే నంబర్‌ వన్‌ అని, వచ్చేది మన ప్రభుత్వమే­నని, జగన్‌ 2.0లో కార్యకర్తలకే అత్యధిక ప్రాధా­న్యం ఇస్తామని పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లు, వైస్‌ చైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, ఆయా జిల్లాల పార్టీ ముఖ్య నాయకులను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత ⇒ ఈ రోజు మనం ఎలాంటి పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తున్నామో నా కంటే మీకే బాగా తెలుసు. మనం రాక్షస యుగంలో ఉన్నాం. కలియుగంలో అంటే చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలంటే.. కేసులు వేసినా భయపడకూడదు. జైళ్లకు పంపినా, చంద్ర­బాబూ.. నిన్ను ఎదుర్కొంటాం అని గట్టిగా అంటేనే రాజకీయాల్లో ఉండగలం. రాజకీయాలు చేయగలం. అదే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటున్న పాఠం. ఈరోజు రాజకీయాలు అలా తయారయ్యాయి. ⇒ మామూలుగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏడాది తర్వాత కొంత వస్తుంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వానికి ఏడాదిలోనే ప్రజా వ్యతిరేకత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ప్రజలు ఆయన్ను తీవ్రంగా ద్వేషిస్తున్నారు. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చాడు. జగన్‌ ఇచ్చినవన్నీ ఇవ్వడమే కాకుండా, ఇంకా మూడు ఎక్కువ ఇస్తానన్నాడు. కానీ, ఏదీ నిలబెట్టుకోలేదు. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. అందుకే ఆయన ప్రభుత్వంపై అంత వ్యతిరేకత వచ్చింది.⇒ చంద్రబాబు, ఆయన పార్టీ కార్యకర్తలు ఏ ఒక్క ఇంటికీ ధైర్యంగా పోలేరు. వారు ఏ ఇంటి తలుపు తట్టినా.. పిల్లవాడి స్థాయి నుంచి ప్రశ్నించడం మొదలు పెడతారు. ఎన్నికలప్పుడు ఇంటింటికి పోయి ఏం చెప్పారు? బాండ్లు అన్నాడు. ఇంకా ఏమేం చెప్పారు? ఇంటింటికీ వెళ్లి, చిన్న పిల్లాడు కనబడితే నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని, అదే ఇంట్లో ఆ పిల్లల అమ్మ కనబడితే నీకు రూ.18 వేలు అని, ఆ ఇంట్లోనే అమ్మమ్మలు కనబడితే నీకు రూ.48 వేలు అని, 20 ఏళ్ల యువకుడు కనబడితే నీకు రూ.36 వేలు అని, రైతు కనబడితే నీకు రూ.26 వేలు ఇస్తామని చెప్పారు. ఆ మాటలు ఇంకా వారిని వెంటాడు­తాయి. మాట మీద నిలబడని రాజకీయ నాయకుడు సీఎం హోదాలో ఉన్నాడు. మాట ఇస్తే, దాన్ని అమలు చేయని వ్యక్తి సీఎంగా ఉన్నాడు.వ్యవస్థలన్నీ నిర్వీర్యం ⇒ రాష్రంలో విద్యా రంగం నిర్వీర్యం అయింది. ఇంగ్లిష్‌ మీడియం లేదు. గోరుముద్ద నామమాత్రం అయింది. నాడు–నేడు లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. మనం అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున ఇచ్చాం. ఇవాళ అది లేదు. నిరుపేదల ఆరోగ్యం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని వదిలేసింది. ఆ బిల్లులు దాదాపు రూ.3,600 కోట్లు ఇవ్వడం లేదు. ఆరోగ్య ఆసరా అమలులోనే లేదు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వక పోవడంతో వైద్యానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. ⇒ ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. దళారులు వచ్చారు. ఆర్బీకే వ్యవస్థను నాశనం చేశారు. ఉచిత ఇన్సూ్యరెన్స్‌ లేదు. పంటనష్ట పరిహారం ఇవ్వడం లేదు.మనం బాగు చేస్తే.. బాబు చెడగొడుతున్నాడు ⇒ మనం 17 మెడికల్‌ కాలేజీలు కడితే, ఈరోజు వాటిని అమ్మేస్తున్నారు. ఏదైనా జిల్లాలో మెడికల్‌ కాలేజీ ఉంటే, అక్కడ అన్ని వైద్య సదుపాయాలు, ఒక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఉన్నట్లు. దానివల్ల ఆ జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రులు రోగులను మోసం చేయలేవు.⇒ మనం మూలపేట (శ్రీకాకుళం జిల్లా)తోపాటు మూడు పోర్టులు కట్టడం మొదలు పెట్టాం. వాటిలో 30 శాతం పనులు పూర్తి చేస్తే, కమీషన్ల కోసం చంద్రబాబు వాటిని అమ్మేస్తున్నాడు.⇒ ఉత్తరాంధ్రలో ట్రైబల్‌ ఇంజినీరింగ్, మెడికల్‌ కాలేజ్, ఐటీడీఏ పరిధిలో ఐదు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం మొదలు పెడితే, ఈ పెద్దమనిషి మొత్తం వదిలేశాడు. భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కోసం మనం భూసేకరణ చేశాం. 30 శాతం పనులు చేశాం. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ ప్రాంతంలో అయినా, ఏ అభివృద్ధి అయినా జరిగింది అంటే కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే.⇒ చంద్రబాబు అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు. ఆయన ఎక్కడా మాట నిలబెట్టుకోలేదు. అలా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. అందుకే తనను ఎవరూ ప్రశ్నించకూడదని భయానక పాలన సాగిస్తున్నాడు. అందులో భాగంగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుపుతున్నారు. ఎవరు మాట్లాడినా, వారి గొంతు నొక్కుతున్నారు. నిలదీస్తున్న గొంతులను నలిపేస్తున్నారు.రాష్ట్రంలో తొలిసారిగా మాన్యుఫ్యాక్చర్‌ విట్నెస్‌ సృష్టిస్తుండటాన్ని చూస్తున్నాం. అంటే నేరంతో ఒక మనిషికి సంబంధం లేకపోయినా, వారికి సంబంధించిన ఒక వ్యక్తిని పట్టుకుని అప్రూవర్‌ అంటున్నారు. ఆయనతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నారు. ఆ మనిషితో, ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు. ఈ మనిషిని అరెస్టు చేస్తున్నారు. అలా ఒక మాన్యుఫ్యాక్చర్‌ ఎవిడెన్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. చరిత్రలో గతంలో ఏనాడూ ఇలాంటివి జరగలేదు. ఒక తప్పుడు సంప్రదాయానికి ఈ పెద్దమనిషి చంద్రబాబు ఈరోజు బీజం వేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో పాత కేసులు తిరగ తోడుతున్నారు. మన ఎమ్మెల్యే అభ్యర్థులు, చురుగ్గా పని చేస్తున్న ప్రజా ప్రతినిధులు, నాయకులను ఇరికిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. - వైఎస్‌ జగన్‌మన ప్రభుత్వ హయాంలో ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ఇంటింటికీ వెళ్లగలిగాడు. మేనిఫెస్టో చూపి, జగన్‌ ఏం చేశాడో చూపి టిక్‌ పెట్టమని అడిగాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు.. మూడు సార్లు ప్రతి ఇంటికీ వెళ్లి, ఎన్నికల ముందు ఏమేం చేశామో చెప్పాం. వాటిని చూపాం. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం పూర్తి చేసిన పార్టీ దేశంలో ఎక్కడా లేదు. అయినా మనం ప్రతిపక్షంలో ఉన్నాం. కారణం కేవలం 10 శాతం మంది వారి మాటలు నమ్మి, మనకు వ్యతిరేకంగా ఓటేశారు. ఇంత మంచి చేసిన మనమే ప్రతిపక్షంలో కూర్చున్నామంటే.. చంద్రబాబు పరిస్థితి ఏమిటి? ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ప్రజలు ఫుట్‌బాల్‌ను తన్నినట్లు తంతారు. - వైఎస్‌ జగన్‌ఉధృతంగా పోరాడుదాం.. రాబోయేది మన ప్రభుత్వమే⇒ ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. మంగళగిరికి చెందిన సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ పాలేటి కృష్ణవేణిని హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చి, పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పారు. అలాగే సుధారాణిని నెలల తరబడి శ్రీకాకుళం నుంచి అన్ని స్టేషన్లు తిప్పారు. బెయిల్‌ రాకుండా చూశారు. మాజీ ఎమ్మెల్యే వంశీపై 11 కేసులు పెట్టారు. ఒకదాంట్లో బెయిల్‌ వస్తే.. మరో కేసు.. రెండు నెలలుగా జైల్లోనే ఉంచారు. ఒక దాని తర్వాత మరో కేసు పెడుతున్నారు.⇒ ఇంకొకరు మాజీ ఎంపీ నందిగం సురేష్‌. దళితుడు. నెలల తరబడి జైల్లో పెట్టారు. బెయిల్‌ మీద బయటకు వస్తే, మరో కేసులో ఇరికించి, జైలుకు పంపారు. వాళ్ల ఇంటి దగ్గరకొచ్చి ఒక మనిషి తిట్టాడు. ఎందుకు తిడుతున్నావని ప్రశ్నిస్తే, మరో కేసు పెట్టి, జైలుకు పంపారు.⇒ ఈ రోజు ఒక తప్పుడు సంప్రదాయం మొదలు పెట్టారు. అది ఒక వృక్షమై, రెండింతలు పెరిగి, వాళ్లనే తన్నే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో గట్టిగా పోరాడుదాం. చూస్తుండగానే ఏడాది గడిచింది. ఇంకా చూస్తుండగానే మూడేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. చీకటి తర్వాత వెలుగు తప్పదు. మనం తప్పకుండా గెలుస్తాం. అందుకే రాబోయే రోజుల్లో ఉధృతంగా పోరాడాలి. ఈలోగా గ్రామ స్థాయి నుంచి బూత్‌ కమిటీలు, మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఉద్యమబాట పట్టి, ప్రభుత్వ తప్పులను ప్రజల్లో ఎండగట్టాలి. అందుకే ఈ సమావేశాల నిర్వహణ. ఈ ప్రక్రియలో పార్టీ నాయకులు, కార్యకర్తలది చాలా గొప్ప పాత్ర.వైఎస్సార్‌సీపీకి కార్యకర్తే నంబర్‌ వన్‌ ⇒ ప్రతి కార్యకర్తకు చెబుతున్నా. మీకు ఎవరు అన్యాయం చేసినా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా, వారి పేరు రాసుకోండి. అది ఏ బుక్‌ అయినా సరే. వారి పేరు మాత్రం కచ్చితంగా రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మనం వచ్చాక, ఈరోజు మీకు అన్యాయం చేసిన వారికి సినిమా చూపిస్తాం. ఆ మనిషి రిటైర్‌ అయినా, దేశం వదిలి పోయినా లాక్కొస్తాం. ఎవ్వరినీ వదిలి పెట్టం. సినిమా ఎలా చూపాలో వారికి చూపిస్తాం. మిమ్మల్ని ఎవరైనా కొట్టినా కొట్టించుకోండి. ఫరవా­లేదు. నీ టైమ్‌ బాగుంది.. కొట్టు అనండి. ఆ తర్వాత మన టైమ్‌ వస్తుంది. అప్పుడు మనం కొడతాం. ఇవాళ వారు నాటుతున్న విత్తనం రేపు రెండింతలు అవుతుంది.⇒ ఈరోజు నేను మీ అన్నగా, మీ బిడ్డగా ఒకటే చెబుతున్నా. జగన్‌ 2.0లో పరిస్థితి ఇలా ఉండదు. పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ రోజు కార్యకర్తల కష్టాలు చూశాను. స్వయంగా చెబుతున్నాను. గతంలో మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్‌. దాంతో మనం యుద్ధం చేశాం. అందువల్ల అనుకున్న మేరకు కార్యకర్తలకు చేయలేకపోయాను. ఇప్పుడు చెబుతున్నాను. రేపు ఈ పరిస్థితి ఉండదు. వైఎస్సార్‌సీపీకి కార్యకర్తనే నంబర్‌ వన్‌.

Rasi Phalalu: Daily Horoscope On 21-05-2025 In Telugu3
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.నవమి రా.10.41 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: శతభిషం ప.2.52 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం: రా.8.59 నుండి 10.31 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.31 నుండి 12.22 వరకు,అమృత ఘడియలు: ఉ.7.50 నుండి 9.24 వరకు.సూర్యోదయం : 5.30సూర్యాస్తమయం : 6.22రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకుయమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు మేషం.... నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.వృషభం.... సోదరులతో సఖ్యత. నిరుద్యోగులకు శుభవార్తలు.. కార్యజయం. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.మిథునం..... రుణాలు చేస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.కర్కాటకం... మిత్రులతో కలహాలు. అనారోగ్యం. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు.సింహం.... ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం.. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.కన్య... కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు పొందుతారు. ఆలయ దర్శనాలు. ఆస్తిలాభం. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.తుల... ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.వృశ్చికం... కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.ధనుస్సు..... నూతన ఉద్యోగావకాశాలు. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.మకరం... ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.కుంభం... పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. మిత్రులు, బంధువుల కలయిక.వస్తులాభాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు అనుకోని హోదాలు.మీనం.... వ్యవహారాలలో అవరోధాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

Other Content Sites To Be Banned In US4
అశ్లీల కంటెంట్‌పై అమెరికా కొరడా

వాషింగ్టన్‌: ఆన్‌లైన్‌లో అశ్లీల కంటెంట్‌పై అమెరికా కొరడా ఝళిపించింది. దాని నియంత్రణకు ‘టేకిట్‌ డౌన్‌’ పేరిట కొత్తం చట్టం తెచ్చింది. దీనిప్రకారం వ్యక్తుల తాలూకు అశ్లీల, అభ్యంతరకర ఫొటోలు, వీడియోలను వారి అనుమతి లేకుండా ఆన్‌లైన్, సోషల్‌ మీడియా వేదికల్లో పోస్ట్‌ చేయడానికి వీల్లేదు. సోషల్‌ ప్లాట్‌ఫాంలు అలాంటి కంటెంట్‌ను తమ దృష్టికి రెండు రోజుల్లోగా తొలగించాల్సి ఉంటుంది.ఈ నిబంధన డీప్‌ఫేక్‌ కంటెంట్‌కు కూడా వర్తిస్తుంది. ఈ చట్టం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భార్య మెలానియా ఎన్నాళ్లుగానో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత బిల్లుపై సోమవారం ఆమె సమక్షంలోనే ట్రంప్‌ సంతకం చేశారు. అనంతరం ఆయన కోరిక మేరకు మెలానియా కూడా బిల్లుపై సంతకం చేయడం విశేషం. ‘‘దీనికోసం మెలానియా ఎంతగానో పోరాడింది. కనుక ఆమె సంతకానికి అర్హురాలు’’ అని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు.

 Pakistan ISI was using spy Haryana YouTuber to identify Indian agents5
ఐఎస్‌ఐ ఏజెంట్‌ జ్యోతి మల్హోత్రా!

చండీగఢ్‌/న్యూఢిల్లీ: ఇండియన్‌ అండర్‌కవర్‌ ఏజెంట్లను గుర్తించడానికి పాకిస్తాన్‌ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ) హరియాణా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra)(33)ను వాడుకుందా? నిజమేనని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఐఎస్‌ఐ హ్యాండ్లర్‌ అలీ హసన్‌తో వాట్సాప్‌లో జ్యోతి చేసిన చాటింగ్‌లను వెలికి తీశారు. ఇద్దరి మధ్య కోడ్‌ భాషలో ఈ చాటింగ్‌లు జరిగాయి. ఒక చాటింగ్‌ను పరిశీలిస్తే.. భారత అండర్‌కవర్‌ ఏజెంట్ల వివరాలు, వారి ఆపరేషన్ల గురించి అలీ హసన్‌ ఆమెను ప్రశ్నించాడు.భారత్‌–పాక్‌ సరిహద్దు అయిన అటారీ బోర్డర్‌ను సందర్శించినప్పుడు ప్రత్యేక ప్రోటోకాల్‌ ఉన్న అండర్‌కవర్‌ ఏజెంట్లను చూశావా? అని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని జ్యోతి బదులిచ్చింది. ప్రోటో కాల్‌ అందుకున్నవారే అండర్‌ కవర్‌ ఏజెంట్లు కావొ చ్చు అని అలీ హసన్‌ చెప్పగా, అలాంటి వారిని తాను చూడలేదని పేర్కొంది. భారత నిఘా ఏజెంట్ల గుట్టుమట్లు తెలుసుకోవడానికి జ్యోతిని అస్త్రంగా ఉపయోగించినట్లు అంచనా వేస్తున్నారు. ఐఎస్‌ఐ కోసమే పని చేస్తున్నట్లు ఆమెకు పూర్తి అవగాహన ఉందని పేర్కొంటున్నారు. పాకిస్తాన్‌కు సంబంధించిన భారీ గూఢచార ముఠాలో ఆమె ఒక కీలక సభ్యురాలని నిర్ధారణకు వచ్చారు. జ్యోతి తొలిసారిగా 2023లో బైశాఖి పండుగ సమయంలో పాకిస్తాన్‌లో పర్యటించింది. ఈ సరిహద్దులు ఇంకా ఎన్నాళ్లో.. జ్యోతి మల్హోత్రా వ్యక్తిగత డైరీ దర్యాప్తు అధికారుల చేతికి చిక్కింది. ఆమె తన ఆలోచనలు, పర్యటనల గురించి ఇందులో రాసుకుంది. పాకిస్తాన్‌ ప్రస్తావన సైతం ఉంది. డైరీలో 11 పేజీల్లో రాయగా.. 8 పేజీల్లో సాధారణ అంశాలు, 3 పేజీల్లో పాకిస్తాన్‌ గురించి హిందీ, ఇంగ్లిష్‌ భాషలో రాతలు కనిపిస్తున్నాయి. ‘‘పాకిస్తాన్‌ ప్రజల ఆదరణ, వారి అతిథి మర్యాదలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాకిస్తాన్‌లో భారతదేశ హిందువుల పర్యటనలు ఇంకా పెరగాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్‌లోని తమ పూరీ్వకుల గ్రామాలను హిందువులు సందర్శించాలి.అక్కడి హిందూ ఆలయాలు, గురుద్వారాలకు సులువుగా వెళ్లొచ్చే పరిస్థితులు రావాలి. 1947లో దేశ విభజన తర్వాత విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలిస్తే బాగుంటుంది. పాకిస్తాన్‌లో పది రోజుల పర్యటన పూర్తి చేసుకొని ఈ రోజే ఇండియాకు తిరిగొచ్చా. రెండు దేశాల మధ్య ఈ సరిహద్దులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. బాధపడే హృదయాలకు ఉపశమనం కలగాలి. మనమంతా ఒకే దేశం, ఒకే నేలకు చెందినవాళ్లం’’ అని జ్యోతి తన డైరీలో రాసుకుంది. మరోవైపు ఆమె కశీ్మర్‌ పర్యటనల వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.అర్ధరాత్రి పొద్దుపోయే దాకా పనిచేయడం ఆమెకు అలవాటు అని గుర్తించారు. రాత్రి ఒంటి గంట సమయంలో వీడియోలను ఎడిటింగ్‌ చేసి, సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తుండేదని చెప్పారు. చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్తున్నానని ఇంట్లో వాళ్లకు చెప్పి మరోచోటుకి వెళ్లినట్లు గుర్తించారు. జ్యోతి వ్యవహారం తెలిసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఆమె ఫోటోలన్నీ తొలగించారు. తన బిడ్డ సంగతి తనకు తెలియదని, దీనిపై తనను ఏమీ ప్రశ్నించవద్దని జ్యోతి తండ్రి స్పష్టం చేశారు. నిందితురాలిపై ప్రశ్నల వర్షంయూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా వ్యవహారంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)తోపాటు ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), మిలటరీ ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. పూర్తి సమాచారం రాబట్టానికి భిన్న కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. జ్యోతి మల్హోత్రా ఆర్థిక లావాదేవీలు, ప్రయాణాల వివరాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఆమె పాకిస్తాన్, చైనాతోపాటు ఇతర దేశాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది. ‘ట్రావెల్‌ విత్‌ జో’ అనే యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ నెల 16న ఆమెను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌)లోని అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో గత రెండు వారాల్లో మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. ఆదాయానికి, ఖర్చులకు పొంతనేదీ?ఇదిలా ఉండగా, నిందితురాలు జ్యోతి మల్హోత్రా ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ పర్యటించింది, ఎవరిని కలిసిందీ పూర్తి వివరాలు తెలిస్తే వాటన్నింటినీ క్రోడీకరిస్తామని, దానివల్ల దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. యూట్యూబ్‌ చానల్‌ ద్వారానే తనకు ఆదాయం వస్తోందని నిందితురాలు చెబుతుండగా, అధికారులు విశ్వసించడం లేదు. ఆమెకు వచ్చిన ఆదాయానికి, విదేశీ పర్యటనలకు అయిన ఖర్చులకు పొంతన లేదని అంటున్నారు. అందుకే ఆర్థిక వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వివరాలు కూపీ లాగుతున్నారు.జ్యోతి ల్యాప్‌టాప్‌పై ఫోరెన్సిక్‌ విశ్లేషణ జరుగుతోందని అధికారులు చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌–పాకిస్తాన్‌ మధ్య నాలుగు రోజులపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో జ్యోతి మల్హోత్రా ఢిల్లీలోని పాకిస్తాన్‌ హైకమిషన్‌లో పనిచేసే ఓ అధికారిని తరచుగా కలిసింది. పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ సిబ్బందితో ఆమెకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్లు ఓ పోలీసు అధికారి చెప్పారు. సోషల్‌ మీడియా ద్వారా జనంలో గుర్తింపు పొందినవారిని నియమించుకొని, దేశ రహస్యాలు కొల్లగొట్టడం ఆధునిక యుద్ధరీతిలో ఒక భాగంగా మారిందని తెలిపారు.

Sakshi Guest Column On US and China Issues6
చైనాతో అమెరికా వైరం ముగిసేదేనా?

అమెరికా, చైనాల ప్రతినిధుల మధ్య ఈనెల 10, 11 తేదీలలో జెనీవాలో జరిగిన చర్చలు వాణిజ్య సుంకాల విషయంలో ఒక రాజీని కుదిర్చాయి గానీ, మరికొన్ని సమస్యలు ఇంకా మిగిలే ఉన్నాయి. మౌలికంగా గుర్తించవలసింది ఏమంటే, ఇరువురి మధ్య అసలు సమస్య సుంకాలకు మించినది. అది ఆధి పత్య సమస్య. చైనాకు ఆధిపత్యం లభించకుండా ఉండేందుకు పలు విధాలుగా ప్రయ త్నిస్తూ వస్తున్న అమెరికా, అందుకు సుంకాల యుద్ధాన్ని కూడా ఒక సాధనంగా ఎంచుకుంది. అయితే, ఈ యుద్ధంలో గెలవలేక పోతు న్నట్లు అర్థం కావటంతో జెనీవాలో రాజీకి వచ్చింది. అంతమాత్రాన ఇరువురి మధ్య ఆధిపత్య వైరం ముగిసినట్లు కాదు. అది అనేక రూపాలలో పలు సంవత్సరాలపాటు సాగనున్నది.తొలుత తగ్గింది అమెరికానే!జెనీవాలో రెండు రోజుల చర్చల తర్వాత, చైనాపై సుంకాలను అమెరికా 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గించగా, చైనా 125 శాతం నుంచి 10 శాతానికి తగ్గించింది. అంతకు ముందు వారాలలో ఒకరిపై ఒకరు పోటాపోటీగా సుంకాలు పెంచుతూ పోయారు. తక్కిన అన్ని దేశాలపై అమెరికా సుంకాలు 50 శాతానికి లోపే కాగా, చైనాపై ఒక దశలో 245కి పెంచారు. తర్వాత అన్ని దేశాలపై 90 రోజులు వాయిదా వేసి చైనాకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. ఆ విధంగా తమ యుద్ధం ప్రధానంగా చైనాపై అన్నది అందరికీ అర్థ మైంది. కానీ, ట్రంప్‌ అంచనా వేసినట్లు చైనా లొంగి రాలేదు. వాణిజ్య యుద్ధాలు తగవనీ, స్వేచ్ఛా వాణిజ్య సూత్రాలకు విరుద్ధమనీ స్పష్టం చేసింది. వాణిజ్య యుద్ధం వల్ల కొన్ని నష్టాలు ఉంటాయని తెలిసినా, ప్రత్యామ్నాయాలను అన్వేషించటం మొదలు పెట్టింది.తనవైపు నుంచి అమెరికాకు చైనా కన్నా ఎక్కువ నష్టాలు కనిపించ సాగాయి. ఆ పరిస్థితులలో చైనాతో రాజీ చర్చల కోసం ట్రంప్‌ ప్రయత్నాలు సాగించారు. చర్చలను చైనాయే కోరుకుంటున్నదంటూ మొదట మేకపోతు గాంభీర్యం చూపి, చివరకు తామే చర్చల తేదీలు ప్రకటించారు. సుంకాలు ఆ స్థాయిలో అవాస్తవికమని ట్రంప్‌తో పాటు ఆయన అధికారులు ముందునుంచే వ్యాఖ్యానించారు. సుంకాలను తాము బహుశా 80 శాతానికి తగ్గించవచ్చునని కూడా ట్రంప్‌ సూచించారు. అటువంటిది జెనీవాలో అనూహ్యంగా 30 శాతానికి వచ్చారు. ఈ విరామం 90 రోజుల కోసం! ఆ తర్వాత కూడా 145 శాతానికి వెళ్లే అవకాశం లేదని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు.ఈ 90 రోజులలో ఏమి జరగవచ్చునన్నది ఒక ప్రశ్న. అదట్లుంచి, జెనీవాలో ఉభయులకూ మరికొన్ని ప్రయోజనాలు కలి గాయి. ఉదాహరణకు, అమెరికాకు అరుదైన ఖనిజాలు, లోహాల ఎగుమతిపై విధించిన నిషేధాన్ని చైనా ఎత్తివేసింది. అవి లేనట్లయితే అమెరికాలో రక్షణ రంగంతో సహా అనేకం తీవ్రంగా దెబ్బతింటాయి. మొత్తం ప్రపంచంలోనే ఈ ఖనిజ నిక్షేపాలు, వాటి శుద్ధి పరిశ్రమలు 70 శాతానికి పైగా చైనా అధీనంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ నిక్షేపాల కోసం ఉక్రెయిన్, రష్యా, కెనడా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, గ్రీన్‌లాండ్, ఆఫ్రికా తదితర ప్రాంతాలలో అమెరికా వేగంగా ప్రయత్నాలు ఆరంభించింది గానీ, అవి ఒకవేళ ఫలించినా వినియోగంలోకి రావాలంటే పదేళ్ళు పట్టవచ్చుననే అంచనాలున్నాయి. కనుక చైనా సరఫరాలు తప్పనిసరి. అదేవిధంగా, చైనా రవాణా నౌకలపై ఆంక్షలు, సుంకా లను అమెరికా రద్దు చేయనున్నది. ఆ విధంగా జెనీవాలో ఇతర లాభాలు కూడా ఇరువురికీ కలిగాయి.చైనా సవాలుసుంకాల యుద్ధం ప్రారంభించటంలో ట్రంప్‌ ఆశించినవి మరొక రెండు ఉన్నాయి. చైనాకు, ఇతర దేశాలకు తరలిపోయిన అమెరికన్‌ పరిశ్రమలు తిరిగి రావటం, తమ వద్ద అన్ని సుంకాలనూ రద్దు చేయగలమని ప్రకటించినందున ఇతరులు తమ దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టటం ఒకటైతే, ఆ కారణంగా తమ వద్ద ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగటం రెండవది. అవి సాకారం కావటం తేలిక కాదని అమెరికా సహా పాశ్చాత్య నిపుణులే విశ్లేషిస్తున్నారు. అందుకు ఎదురయ్యే తక్షణ సమస్యలు రెండున్నట్లు చెప్తు న్నారు. ఒకటి–అవసరమైన మౌలిక సదుపాయాలు, సప్లయ్‌ చెయిన్లు లేకపోవటం; వాటి అభివృద్ధికి తగినంత కాలం అవసరం కావటం. రెండవది–ఇతర దేశాల కార్మికులు చేసే అనేక పనులకు అమెరికన్‌ కార్మికులు సిద్ధపడక పోవటం, వారికి ఆ శిక్షణలూ లేకపోవటం.అందువల్ల, 90 రోజుల అనంతరపు అనుభవాలు, సమీక్షలు ఆశావ హంగా ఉండే అవకాశాలు కన్పించవు.మరొక ముఖ్య విషయం. ట్యారిఫ్‌లకు చిన్న దేశాలు బెదిరిపోగా, కెనడా, యూరప్, చైనా గట్టిగా ప్రతిఘటించాయి. ఇండియా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, తైవాన్‌ ఇచ్చిపుచ్చుకునే విషయం ఆలో చించాయి. చివరకు జెనీవాలో జరిగినది అందరికీ కొంత ధైర్యాన్నిస్తు న్నది. వారు చైనా స్థాయిలో ధిక్కరించటం సాధ్యం కాకపోయినా,ట్రంప్‌తో మరికొంత బేరమాడగలరు. తమకు అమెరికా ఎంత అవస రమో వారికి అమెరికా అవసరం కూడా ఏదో ఒక స్థాయిలో ఉంటుంది. అమెరికా ఎంత శక్తిమంతమైన దేశమైనా అన్నీ తను కోరు కున్నట్లే జరగబోవు. స్వేచ్ఛా వాణిజ్యానికి, డబ్ల్యూటీఓకు సృష్టికర్తలు వారు. పెట్టుబడులు ఎటునుంచి ఎటైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చునని సిద్ధాంతీకరించిందీ వారే! దాని ఫలితాలను దశాబ్దాల పాటు పొందిన తర్వాత ఇపుడు భయపడటం ఎందుకు? కొన్ని విధానాల ఫలితాలు ఒక దశలో ఒక విధంగా ఉన్నప్పటికీ, కాలం గడిచినకొద్దీ కొత్త పరిణా మాలు సంభవిస్తాయి. అపుడు ఆ విధానాలు, ఫలితాలలో వైరు ద్ధ్యాలు తలెత్తుతాయి. అటువంటి కొత్త పరిణామం చైనా అయింది.చరిత్ర మలుపులో...అమెరికా సమస్య కేవలం వాణిజ్య లోటు కాదు. చైనా గత 15–20 ఏళ్ళుగా నాలుగు విధాలుగా వేగంగా అభివృద్ధి చెందుతు న్నది. ఆర్థికం. సైనికం. శాస్త్ర–సాంకేతిక రంగాలు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పలుకుబడి. ఇవి నాలుగూ అమెరికా అగ్రస్థానాన్ని దెబ్బతీ యగలవు. ఒకప్పటి సోవియెట్‌ యూనియన్‌ ఏ బలహీనతల వల్ల పతనమైందో చైనా కూడా అదే విధంగా పతనం కాగలదని ఒక దశలో ఆశించారు. కానీ, సోవియెట్‌ పతనం నుంచి పాఠాలు నేర్చుకున్న చైనా తన జాగ్రత్తలు తాను తీసుకుంటూ వస్తున్నది. కనుకనే అమెరికా తర్వాత రెండవ ఆర్థిక శక్తిగా, రెండవ సైనిక శక్తిగా, రెండవ శాస్త్ర–సాంకేతిక శక్తిగా మారింది. బ్రిక్స్, బీఆర్‌ఐ (బెల్ట్‌ అండ్‌ రోడ్‌), డీడాల రైజేషన్, బహుళ ధ్రువ ప్రపంచ బలోపేతం వంటి మార్గాలలో అమె రికా రాజకీయ ఆధిపత్యం కోల్పేయే సూచనలు కనిపిస్తున్నాయి.అమెరికా, చైనాల వైరం ఈ విధంగా మౌలికమైనది, దీర్ఘకాలిక మైనది, వ్యూహాత్మకమైనది. ఇందులో సుంకాల యుద్ధం ఒక చిన్న విషయం. జెనీవా రాజీ వరకు జరిగిన పరిణామాలు ఆ చిన్న ఆరంభ యుద్ధంలో తొలి దశ మాత్రమే! ఇందులో ఏది జరిగినా, వైరం మాత్రం కొనసాగుతుంది. ఈ యుద్ధకాండ సుదీర్ఘమైనది. చరిత్రను ఒక కొత్త మలుపు తిప్పగలది.టంకశాల అశోక్‌ వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు

Sakshi Editorial On All-party Meeting7
‘అఖిలపక్షం వేళ’ అనైక్యత!

దేశం కోసం సమష్టిగా కదలాల్సిన సందర్భాల్లో సైతం కలవలేనంతగా అధికార విపక్షాలు ఎడ మొహం పెడమొహంగా మారాయి. పెహల్‌గామ్‌లో గత నెల 22న ఉగ్రవాదులు సాగించిన మారణ కాండ మొదలు మన ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్, ఈ నెల 10న కాల్పుల విరమణ, పాకిస్తాన్‌ దురాలోచనలూ వగైరా ప్రపంచానికి తెలియజెప్పేందుకు అధికార, విపక్ష ఎంపీలతో ఏర్పాటు చేసిన ఏడు అఖిలపక్ష బృందాల కూర్పు ప్రక్రియ వివాదాస్పదంగా మారటం దీన్ని చాటుతోంది. మన దేశంనుంచి సమష్టి స్వరం వినబడితే దాని ప్రభావం వేరుగా వుంటుంది. పాకిస్తాన్‌ సైతం ఇదే తరహాలో అఖిలపక్ష ప్రతినిధి బృందాలను పంపటానికి సన్నాహాలు చేసుకుంటున్నది. కనీసం ఇందుకోసమైనా విభేదాలు పక్కనబెట్టి ఒక్కటై నిలబడదామన్న స్పృహ అటూ ఇటూ కరువవుతోంది. ఏ దేశంలోనూ ఇలా వుండదు. అమెరికాలో ప్రపంచ వాణిజ్య కేంద్రం (డబ్ల్యూటీసీ)పై ఉగ్రదాడి మొదలు ఇందుకు ఎన్నయినా ఉదాహరణలివ్వొచ్చు. ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరుతో అమెరికా అఫ్గాన్‌ను వల్లకాడు చేసింది. చివరకు ఒరిగిందేమీ లేదు. అఫ్గాన్‌నుంచి అవమానకరంగా నిష్క్రమించాల్సి వచ్చింది. అయినా అక్కడి విపక్షం మౌనంగా ఉండిపోయింది. కానీ ఇక్కడలా కాదు. యూపీఏ హయాంలో ముంబైపై ఉగ్రదాడి, దానికి వెనకాముందూ జరిగిన అనేకానేక ఉదంతాల్లో మన దేశంలో అధికార పక్షంపై విపక్షం విరుచుకుపడటం, యక్షప్రశ్నలు వేసి ఇరుకున పడేసే ప్రయత్నం చేయటం రివాజుగా మారింది. యూపీఏ హయాంలో బీజేపీ విపక్షంలోవుండి ఏం చేసేదో, ఇప్పుడు కాంగ్రెస్‌ సైతం ఆ పనే చేస్తోంది. పుల్వామా ఉగ్రదాడి సమయంలో మరీ దారుణం. జవాన్ల త్యాగాలూ, వారు దెబ్బకు దెబ్బ తీసిన వైనమూ 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో చర్చనీయాంశంగా మారటం ఆశ్చర్యపరిచింది. ఈ ఉదంతాలను బీజేపీ తనకను కూలంగా మలుచుకునే ప్రయత్నం చేయగా, ప్రభుత్వ వైఫల్యంపై విపక్షం చాటింపు వేసింది. అయితే మన దేశంలోనూ ఒకప్పుడు అధికార, విపక్షాలు కలిసికట్టుగా పనిచేసిన ఉదంతాలు లేకపోలేదు. ఇందుకోసం ఎన్నడో 1971 నాటి భారత్‌–పాక్‌ యుద్ధం వరకూ పోనవసరం లేదు. 1994లో కశ్మీర్‌పై భారత్‌ వైఖరిని వివరించటానికి నాటి ప్రధాని పీవీ నరసింహారావు రూపొందించిన అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహించింది అప్పటి విపక్ష నేత అటల్‌ బిహారీ వాజపేయి! పాతికేళ్ల క్రితం కార్గిల్‌ యుద్ధ సమయంలో నాటి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమూ, కాంగ్రెస్‌తోసహా విపక్షాలూ దేశభద్రత కోసం కలిసికట్టుగా పనిచేశాయి. కానీ ఇప్పుడెందుకు పరస్పరం తప్పులు వెదుక్కొనే తాపత్రయాన్ని ప్రదర్శిస్తున్నట్టు? దేశంలో తక్షణం వచ్చే ఎన్నికలేమీ లేవు. అయినా పెహల్‌గామ్‌ను రాజకీయంగా వినియోగించుకోవటానికి అటూ ఇటూ పోటీపడుతున్నారు. త్రివిధ దళాల అధికార ప్రతినిధులు చెప్పేవరకూ ఆగకుండా ఇష్టానుసారం ఉన్నవీ లేనివీ ప్రచారం చేసి, విపక్షాలను పాకిస్తాన్‌ అనుకూలురుగా, దేశద్రోహులుగా చూపటానికి బీజేపీ శ్రేణులూ, సాను భూతిపరులూ చేయని ప్రయత్నం లేదు. తొలి ప్రధాని నెహ్రూ ఉదారంగా పాకిస్తాన్‌కు నదీజలాలు, భారీయెత్తున సొమ్ము కట్టబెట్టారని బీజేపీ నేతలు ఇంకా ఆరోపణలు గుప్పిస్తూనే వున్నారు. ఒకపక్క అఖిలపక్షాన్ని పంపుతూ మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? వీటిని ఎలా ఎదుర్కొనాలో తెలియక ఇష్టానుసారం మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులు చులకనవుతున్నారు. యుద్ధ విమానాలు ఎన్ని కూలాయి... మనవైపు జరిగిన నష్టమెంత అంటూ రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ఇవి అడగకూడని ప్రశ్నలేమీ కాదు... కానీ అందుకు తగిన వేదికను ఎంచుకోవాలని కూడా ఆయనకు తోచదు. ఇంతకూ అఖిలపక్ష బృందాల కూర్పుపై ఇంత వివాదం ఎందుకొచ్చినట్టు? విపక్షాలను విశ్వా సంలోకి తీసుకుని, వారు పంపిన పేర్లనుంచి ఎంపికచేసే కనీస మర్యాద అధికార పక్షం పాటించివుంటే సమస్య తలెత్తేది కాదు. విపక్షానికి ఆలోచించే శక్తిసామర్థ్యాలు లేవన్నట్టు సర్కారు ప్రవర్తించింది. కాంగ్రెస్‌ పార్టీ నలుగురు సభ్యుల పేర్లు పంపితే వారిలో ఒక్కరినే ఎంపిక చేసింది. పోనీ సర్కారు ఎంచుకున్నది కూడా సమర్థుల్నే కదా అనే సర్దుబాటు ధోరణి కాంగ్రెస్‌కు లేదు. అసలు ఆ పార్టీ నుంచి వెళ్లిన జాబితాలో సల్మాన్‌ ఖుర్షీద్, శశిథరూర్, మనీష్‌ తివారీ తదితరుల పేర్లు ఎందుకు లేకుండా పోయినట్టు? సీనియర్‌ నేత ఖుర్షీద్‌ను ఎంపిక చేసిన ప్రభుత్వం తీరా ఆయన సీనియారి టీని కాదని జేడీ(యూ) నేత సంజయ్‌ ఝాకు సారథ్య బాధ్యతలు ఎందుకిచ్చినట్టు? సమష్టి స్వరం వినబడాల్సిన ఈ సమయంలో ఇన్ని లుకలుకలుండటం మంచిదేనా? ఇంత రాద్ధాంతం చేసిన కాంగ్రెస్‌ చివరకు ఈ వివాదాన్ని పొడిగించదల్చుకోలేదని చేతులెత్తేసింది. కానీ ఎప్పుడూ వీరంగం వేసే అలవాటున్న తృణమూల్‌ మాత్రం ప్రభుత్వం ఎంపిక చేసిన సభ్యుణ్ణి తప్పుకోమని చెప్పింది. దాంతో ప్రభుత్వం తగ్గి ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ సూచించిన నేతకు స్థానం కల్పించింది. అఖిలపక్షం పంపటంలోని ఉద్దేశమే సమష్టితత్వాన్ని, ఈ దేశ సంకల్పాన్ని, పాకిస్తాన్‌ కుయుక్తులను చాటడానికైనప్పుడు సభ్యుల ఎంపిక వివాదాస్పదం కాకుండా ప్రభుత్వం చూడాల్సింది. ఈమధ్య ఆపరేషన్‌ సిందూర్‌ మొదలుకొని పార్టీ వైఖరికి భిన్నంగా పలు ప్రకటనలిస్తూ సంచలనం సృష్టిస్తున్న శశిథరూర్‌ను కాంగ్రెస్‌ ఎంపిక చేయకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన్ను ఏరికోరి ఎంపిక చేయటం కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టడానికేనన్న విషయంలో ఎవరికీ సందేహం అక్కర్లేదు. ఏదేమైనా ఇలాంటి సంక్షోభ సమయాల్లో అవసరమైన సంయమనం, హుందాతనం ఇరువైపులా కనబడకపోవటం దురదృష్టకరం.

PC Ghose Commission issues notices to KCR to appear for hearing8
కేసీఆర్‌కు నోటీసులు

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న విచారణలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, ఇతరులను కమిషన్‌ విచారించింది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు నోటీసులు జారీ చేసింది. జూన్‌ 5వ తేదీన విచారణకు హాజరుకావాలని తెలిపింది. బీఆర్‌ఎస్‌ హయాంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు సైతం నోటీసులు ఇచి్చంది. ముగ్గురికీ వేర్వేరుగా మూడు పేజీలున్న నోటీసులను మెసెంజర్‌ ద్వారా అలాగే రిజిస్టర్‌ పోస్టులోనూ పంపింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని సూచించింది. జూన్‌ 6న హాజరుకావాలని హరీశ్‌రావుకు, 9వ తేదీన రమ్మని ఈటల రాజేందర్‌కు తెలిపింది. ఇప్పటికే పలువురి విచారణ పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్న ప్రభుత్వం, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమరి్పంచేందుకు గత ఏడాది మార్చిలో జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను నియమించింది. బరాజ్‌ల నాణ్యతపై కూడా విచారించాలని సూచించింది. దీనిపై దాదాపుగా విచారణ పూర్తి చేసిన కమిషన్, రెండుమూడు రోజుల్లో నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోందని భావిస్తున్న తరుణంలో.. కమిషన్‌ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సహజ న్యాయ సూత్రాల మేరకు ఈ ముగ్గురి వాదనలు సైతం వినాలని జస్టిస్‌ ఘోష్‌ నిర్ణయించినట్లు సమాచారం. కాళేశ్వరం నిర్మాణం సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌లను ప్రశ్నించి మరింత సమాచారం జోడిస్తే సమగ్ర నివేదిక ఇచ్చినట్లు అవుతుందని భావించిన కమిషన్‌ వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 సెక్షన్‌ 311ను అనుసరించి నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. పినాకి చంద్ర ఘోష్‌ కమిషన్‌ ఇదివరకే పలువురు ఇంజనీర్లు, నిర్మాణదారులు, అప్పట్లో నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఐఏఎస్‌ అధికారులను విచారించిన సంగతి విదితమే. 2019లో బరాజ్‌ల నిర్మాణం పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడు బరాజ్‌ల నిర్మాణ పనులు 2016లో ప్రారంభించగా 2019 మేలో పూర్తయ్యాయి. అయితే 2023 సెపె్టంబర్‌లో మేడిగడ్డ బరాజ్‌లోని ఒక బ్లాక్‌ పిల్లర్లు కుంగిపోయాయి. దీనిపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే నివేదిక ఇచి్చంది. కేసీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో మొదటి దఫాలో హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్‌ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. రెండో దఫాలో కేసీఆర్‌ సీఎంగా, నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించగా.. హరీశ్‌రావు ఆర్థిక మంత్రిగా కొనసాగారు. ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణం తదితర అంశాల్లో వీరి నిర్ణయాలు కీలకంగా ఉన్నాయనే ఉద్దేశంతో, వారిని విచారించి వాదనలు రికార్డు చేయాలని కమిషన్‌ భావిస్తున్నట్టు సమాచారం. నోటీసుల ప్రకారం వారంతా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సి ఉండగా, ఒకవేళ వారు కోరితే వర్చువల్‌గా కూడా విచారణ కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు కమిషన్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేసీఆర్‌తో హరీశ్‌రావు భేటీపీసీ ఘోష్‌ కమిషన్‌ నోటీసుల నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. నోటీసులు, తదుపరి పరిణామాలు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగగా.. కేసీఆర్, హరీశ్‌రావు విచారణకు హాజరవుతారా? లేదా సమయం కోరతారా అన్న అంశంలో స్పష్టత రాలేదు.

High Court slams Andhra Pradesh Police9
ఎన్నికల కమిషన్‌ ఆదేశాలన్నా లెక్క లేదా?

ఎవరినీ వదలం.. పౌరుల రక్షణ పోలీసుల బాధ్యత. దీనినుంచి వారు తప్పిం­చుకోలేరు. సంక్షేమ రాజ్యంలో పోలీసుల బాధ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వ్యవహారంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. డీజీపీ నుంచి కానిస్టేబుల్‌ వరకు ఎవరినీ విడిచిపెట్టం.- హైకోర్టు ఆగ్రహంసాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ‘ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశాలన్నా లెక్క లేదా..? వాటిని కూడా అమలు చేయరా? ఎన్నికలో పాల్గొనే వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులకు తగిన భద్రత కల్పించాలని ఆదేశించినా పట్టించుకోరా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయకపోవడంలో ఔచి­త్యం ఏమిటని నిలదీసింది. పోలీసుల సమర్థత ము­ఖ్యంగా ఏపీ పోలీసుల సమర్థత గురించి తమకు బాగా తెలుసునని వ్యాఖ్యానించింది. వారు ఎంత సమర్థులో అందరికీ తెలుసని.. వారి గురించి ప్రత్యేకంగా తమకు చెప్పాల్సిన అవసరం లేదంది. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నగర పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు వీలుగా హైకోర్టును ఆశ్రయించిన ఇద్దరితో పాటు 11 మంది కౌన్సిలర్లకు తగిన భద్రత కల్పించాలని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించింది. కౌన్సిలర్లు ఉన్న ప్రదేశం నుంచి పోలింగ్‌ కేంద్రం వరకు వారికి భద్రత కల్పించాలని సూచించింది. తమ ఆదేశాల అమలు విషయమై నివేదిక సమర్పించాలని కమిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.భద్రత కోసం కోర్టుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులుతిరువూరు నగర పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారందరికీ తగిన భద్ర­త కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు మోదుగు ప్రసాద్, గుమ్మా వెంకటేశ్వరి హైకోర్టులో సోమవారం అత్యవసరంగా హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ లక్ష్మణరావు మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది పాపుడిప్పు శశిధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. తిరువూరులో చైర్మన్‌ ఎన్నిక ఈ నెల 19న ఎన్నిక జరగాల్సి ఉందన్నారు. కౌన్సిలర్లు ఓటు వేసేందుకు వెళ్తుండగా, అధికార టీడీపీ నేతలు అడ్డుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. చైర్మన్‌గా పోటీ చేస్తున్న వ్యక్తిని సీఐ, డీఎస్పీ తీసుకెళ్లడంతో ఎన్నిక మంగళవారానికి వాయిదా పడిందన్నారు. వార్డు సభ్యులకు భద్రత కల్పించేలా చూడాలంటూ తాము ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం ఇచ్చామన్నారు. శాంతిభద్రతల సమస్యతో వార్డు సభ్యులు వారి నివాసాల్లో ఉండలేని పరిస్థితి వచ్చిందని.. చాలామంది హోటళ్లలో తలదాచుకుంటున్నారని చెప్పారు. తమ వార్డు సభ్యులు ఎక్కడ ఉన్నారో చెప్పి వారికి భద్రత కల్పించాలని కోరామన్నారు. ఈ వినతిపత్రాన్ని ఎన్నికల సంఘం విజయవాడ పోలీస్‌ కమిషనర్, ఎన్నికల అధికారి, కలెక్టర్, డీజీపీ తదితరులందరికీ పంపిందని శశిధర్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులకు భ­ద్రత కల్పించాలని ఆదేశించిందన్నారు. కానీ, వీటి­ని పోలీసులు అమలు చేయలేదని.. వార్డు సభ్యులు ఇళ్లకు తిరిగి వస్తేనే భద్రత కల్పిస్తామని సీఐ, డీఎస్పీ చెబుతున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది (హోం) అడుసుమల్లి జయంతిని న్యాయమూర్తి వివరణ కోరారు. భద్రత కోసం ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇస్తే సరిపోదని, పోలీసులకు కూడా ఇవ్వాలని ఆమె తెలిపారు. పోలీసులకు ఎందుకు వినతిపత్రం ఇవ్వలేదని శశిధర్‌రెడ్డిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేసే వార్డు సభ్యుడిని తిరువూరు సీఐ తీసుకెళ్లారని, అందుకే ఆయనకు వినతిపత్రం ఇవ్వలేదని శశిధర్‌ సమాధానం ఇచ్చారు. ‘‘సీఐ పేరు ఏమిటి?’’ అని న్యాయమూర్తి ప్రశ్నించగా, సీఐ గిరిబాబు, డీఎస్పీ ప్రసాదరావు అని శశిధర్‌ తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. ఇరుపక్షాలు కోర్టులతో ఆడుకోవద్దని స్పష్టం చేశారు. పోలీసులు తప్పు చేస్తే కోర్టు ధిక్కారం కింద తీవ్రంగా శిక్షిస్తామని, వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. న్యాయస్థానాల్లో షోలు చేయవద్దని హితవు పలికారు.వార్డు సభ్యులు ఎక్కడున్నారో స్పష్టంగా చెప్పాంఈ సమయంలో శశిధర్‌రెడ్డి స్పందిస్తూ, తాము అవాస్తవాలు చెప్పడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు ఎక్కడ ఉన్నారో ఎన్నికల సంఘానికి ఇచ్చిన వినతిపత్రంలో స్పష్టంగా చెప్పామని, వాటిని పరిగణనలోకి తీసుకుని హోటల్‌లో ఉన్న కౌన్సిలర్లు, ఇంటి వద్ద ఉన్న వార్డు సభ్యులకు పోలింగ్‌ కేంద్రం వరకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించిందని తెలిపారు. (ఈసీ ఆదేశాలను చదివి వినిపించారు).పోలీసులకు తెలియదంటేమేం నమ్మాలా?వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు ఎక్కడ ఉన్నారో పోలీసులకు తెలియదని జయంతి చె­ప్పారు. దీనిపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మాట ఓ సామాన్యుడు చెబితే నమ్ముతామని, తమకు తెలియదని పోలీసులు చెబితే ఎలాగని ప్రశ్నించారు. పోలీసులు తెలియదంటే నమ్మేస్తామని అనుకుంటున్నారా? అంటూ నిలదీశారు. వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు ఎక్కడ ఉంటే అక్కడినుంచి పోలింగ్‌ కేంద్రం వరకు భద్రత కల్పించాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు సరిపోవా? అంటూ ప్రశ్నించారు.భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించాంఎన్నికల సంఘం తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ, వైఎస్సార్‌సీపీ వినతిపత్రాన్ని పోలీసు కమిషనర్, ఎన్నికల అధికారి, కలెక్టర్, డీజీపీ తదితరులందరికీ పంపి భద్రతపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులు ఎక్కడ ఉంటే అక్కడినుంచి పోలింగ్‌ కేంద్రం వరకు వారికి భద్రత కల్పించాలని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ సమయంలో పోలీసులు ఏవైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

IPL final in Ahmedabad10
అహ్మదాబాద్‌లో ఐపీఎల్‌ ఫైనల్‌

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ 18వ సీజన్‌ తుదిపోరుకు అహ్మదాబాద్‌ వేదిక కానుంది. నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో జూన్‌ 3న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుందని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది. రెండో క్వాలిఫయర్‌ పోరు కూడా అహ్మదాబాద్‌లోనే (జూన్‌ 1న) జరుగుతుంది. నిజానికి ఈ రెండు మ్యాచ్‌లు గత విజేత కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కావడంతో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానంలో జరగాలి. అయితే భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలతో లీగ్‌ను వారం వాయిదా వేశారు. సవరించిన షెడ్యూల్‌ సమయంలో కోల్‌కతా, హైదరాబాద్‌లో వర్షాలు ఉంటాయనే సమాచారంతో ఈ రెండు నగరాల్లో జరగాల్సిన ‘ప్లే ఆఫ్స్‌’ మ్యాచ్‌లను అహ్మదాబాద్, ముల్లాన్‌పూర్‌ (న్యూ చండీగఢ్‌) తరలించారు. 2022, 2023 ఐపీఎల్‌ ఫైనల్స్‌ అహ్మదాబాద్‌లోనే జరిగాయి. ఇక ముందనుకున్న షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌లో జరగాల్సిన తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లను ముల్లాన్‌పూర్‌లో నిర్వహిస్తారు. ఈ నెల 29న తొలి క్వాలిఫయర్, 30న ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ముల్లాన్‌పూర్‌లో జరుగుతాయి. దీంతో ఈ సీజన్‌లో కోహ్లి మ్యాచ్‌ను క్వాలిఫయర్‌ రూపంలో అయినా హైదరాబాద్‌లో చూడాలనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. రొటేషన్‌లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హోం మ్యాచ్‌కు ఈసారి అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ఆరంభం నుంచి అదరగొట్టడంతో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. దీంతో టాప్‌–2 జట్ల మధ్య తొలి క్వాలిఫయర్‌... 3–4వ స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్‌... ఈ రెండింటిలో ఏదైనా ఒక మ్యాచ్‌లోనైనా కోహ్లి మెరుపులు చూడాలనుకున్న హైదరాబాద్‌ ప్రేక్షకులు ఇప్పుడు మరో సీజన్‌ దాకా నిరీక్షించక తప్పదు. ఈ నెల 23న బెంగళూరు, సన్‌రైజర్స్‌ల మధ్య బెంగళూరు వేదికగా జరగాల్సిన లీగ్‌ మ్యాచ్‌ను లక్నోకు మార్చారు. 23న బెంగళూరులో భారీ వర్ష సూచన ఉండటంతో మ్యాచ్‌ను లక్నోకు తరలించినట్లు బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన చివరి మ్యాచ్‌ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. ఐపీఎల్‌ పునఃప్రారంభమైన 17న బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ల మధ్య మ్యాచ్‌ వర్షార్పణమైంది. ఐపీఎల్‌ ‘ప్లే ఆఫ్స్‌’షెడ్యూల్‌మే 29 క్వాలిఫయర్‌–1 ముల్లాన్‌పూర్‌ మే 30 ఎలిమినేటర్‌ ముల్లాన్‌పూర్‌ జూన్‌ 1 క్వాలిఫయర్‌–2 అహ్మదాబాద్‌ జూన్‌ 3 ఫైనల్‌ అహ్మదాబాద్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement