
అమృత్సర్‌లోని స్వర్ణ దేవాలయానికి పాకిస్తాన్ వల్ల ముప్పు ఉందని తెలియగానే రక్షణ వ్యవస్థల పటిష్టం చేశారు. ఆలయంలోకి తుపాకులను తీసుకెళ్లడానికి ఆలయ ప్రధాన గ్రంథి (గురుద్వార్ పర్యవేక్షకుడు) అనుమతించారని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ అధికారి సుమర్ ఇవాన్ పేర్కొన్నారు.
క్షిపణులను, డ్రోన్లను గుర్తించడానికి గోల్డెన్ టెంపుల్ లైట్లను ఆఫ్ చేయడానికి కూడా ఆలయ పర్యవేక్షకులు అనుమతిచ్చారు. కొన్నేళ్లుగా ఆలయంలో వెలుగుతున్న లైట్లను ఆపివేయడం బహుశా ఇదే మొదటిసారి. ఆలయ రక్షణ విషయంలో మాకు సహకరించిన స్వర్ణ దేవాలయ సిబ్బందికి.. లెఫ్టినెంట్ జనరల్ కృతఙ్ఞతలు తెలిపారు.
ప్రతిరోజూ లక్షలాది మంది సందర్శిస్తున్న అంతర్జాతీయ ఖ్యాతి గడించిన స్వర్ణ దేవాలయాన్ని కాపాడుకోవాలి. ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్తాన్ ఈ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుంది. పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత సైన్యం తిప్పిగొట్టి.. దేవాలయం మీద చిన్న గీత కూడా పడకుండా అడ్డుకుంది.
పాకిస్తాన్ ఎప్పుడూ.. ఎక్కువ మంది జనాభా ఉన్న ప్రాంతాలను లేదా మతపరమైన ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ విషయాన్ని భారత సైన్యం ముందుగానే గ్రహించిందని లెఫ్టినెంట్ జనరల్ తెలిపారు. నిఘా వర్గాలు కూడా స్వర్ణ దేవాలయం మీద దాడులు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు.