సోషల్ మీడియాలోడిజిటల్ గన్ బజార్
అక్రమ ఆయుధ కొనుగోలుకు సంబంధించి 650 సోషల్ మీడియా ఖాతాలు ఉన్నట్టు గుర్తింపు
టెలిగ్రామ్, వాట్సాప్ వంటి యాప్స్ ద్వారా సంప్రదింపులు
సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ హ్యాక్ ఎలైట్ అధ్యయనంలో విస్తుగొలిపే అంశాలు
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ వ్యాపారంలో చీకటి కోణాలు పెరుగుతున్నాయి. డార్క్‌వెబ్ వంటి నిషేధిత సైట్లలోనే కాదు ఇప్పుడు సోషల్ మీడియా యాప్‌ల ద్వారా కూడా అక్రమ ఆయుధ కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో ఆర్డర్లు.. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్‌లలో విక్రయాలకు సంబంధించిన సంప్రదింపులు జరుగుతున్నాయన్న విస్తుగొలిపే అంశాలు సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ హ్యాక్ ఎలైట్ అధ్యయనంలో వెల్లడయ్యాయి.
ఈ నెట్‌వర్క్ అనేక రాష్ట్రాల్లోని అక్రమ ఆయుధ తయారీదారులు, మధ్యవర్తులను, కొనుగోలుదారులను కలుపుతుందని వెల్లడించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలను పెంచేందుకు ఇలా ఎన్‌క్రిపె్టడ్ యాప్‌లను ఉపయోగిస్తున్నారని ఈ అధ్యయనం హెచ్చరించింది. కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపు అంతా క్రిప్టోకరెన్సీలోనే జరుగుతున్నట్టుగా చెప్పింది.
దేశంలో తుపాకీల బ్లాక్ మార్కెట్ ఆన్‌లైన్‌లోకి మారుతోందని అధ్యయనం స్పష్టం చేస్తోంది. డీలర్లు, మధ్యవర్తులు ప్రకటనలు, చర్చలు, అమ్మకాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వేదికగా చేసుకుంటున్నారు. కొనుగోలుదారులు ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో తమకు కావాల్సిన అంశాలపై సెర్చ్ చేస్తున్నట్టు తెలిపింది.
అధ్యయనంలోని అంశాలు ఇలా..:
» అక్రమ ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన 3,500 కంటే ఎక్కువ పోస్టులు, సందేశాలు ఉన్నట్టు గుర్తించారు.
» 650 కంటే ఎక్కువ సోషల్ మీడియా ఖాతాలు, గ్రూపులు.. చానల్స్ ఆయుధ కొనుగోళ్లకు సంబంధించి చురుకైన పాత్ర పోషించాయి.
» కనీసం 400 ప్రత్యేక ఫోన్ నంబర్లను ఆన్‌లైన్ ఆయుధ కొనుగోళ్లలో వాడుతున్నారు.
» ప్రధానంగా ఈ ఆన్‌లైన్ ఆయుధ కొనుగోలు దందా... మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హరియాణా, అస్సాం, పశి్చమ బెంగాల్, ఢిల్లీ సహా 10 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో సాగుతోంది.
» ఆయుధ కొనుగోళ్లపై సంప్రదింపులు జరిగిన కొంత సేపటికే ఆ ఎన్‌క్రిప్టెడ్ చాట్‌లను, పోస్టులను తొలగిస్తున్నారు. మళ్లీ కొత్త గ్రూపులు ఏర్పాటు చేసి చర్చలు సాగిస్తున్నారు.
ప్రశ్నార్థకంగా ప్రజల భద్రత: ఆన్‌లైన్‌లోనూ అక్రమ ఆయుధాలు అందుబాటులో కి వస్తుండటం ప్రజా భద్రతను ప్రశ్నార్థకంగా మార్చుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దోపి డీలు, మత ఘర్షణలు, వ్యవస్థీకృత నేరాలకు దారితీసే ప్రమాదం ఉంది. అసాంఘిక శక్తుల చేతుల్లోకి ఆయుధాలు వెళ్తే శాంతిభద్రతల సమస్యలు మరింత జఠిలమయ్యే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో ఇలాంటి ముఠాలు నడిపే గ్రూప్‌లపై పోలీసులు నిఘా పెట్టడం, రియల్ టైమ్‌లో ట్రాక్ చేయడానికి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఈ నూతన ట్రెండ్స్ గుర్తు చేస్తున్నాయి.


