
లండన్: ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకల్లో భాగంగా బ్రిటన్ పార్లమెంట్ హాలులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. హౌస్ ఆఫ్ లార్డ్స్ గా పిలువబడే యూకే పార్లమెంట్ ఎగువ సభలో రోహాంప్టన్ విశ్వవిద్యాలయ చాన్సలర్, యూకే మాజీ మంత్రి బారోనెస్ వర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిపారు.. ఈ కార్యక్రమానికి చిలీ, బెలిజ్ జపాన్ తదితర దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, రాయబారులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు.
ఈ సందర్బంగా వివిధ దేశాలకు చెందిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ కళారూపాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన కళాకారులు ప్రార్థన నృత్యం, మోహినీ అట్టం, కరగట్టం, మిథిలా, జిజియా నృత్యం, గోవా సాంగ్స్ తో అలరించారు. దీనిలో భాగంగా భారత మాజీ రాయభారి అభయకుమార్ రాసిన ఆన్ ఎర్త్ గీతానికి హైదరాబాద్‌కు చెందిన రాగసుధ వింజమూరి భరతనాట్యం ప్రదర్శించారు. ఇక చిలీ సంప్రదాయ నృత్యాన్ని డేనియల్ పెరెజ్ మున్స్టర్ ఆధ్వర్యంలో ఆ దేశ రాయబార కార్యాలయం అధికారులు ప్రదర్శించారు.
దీనిలోభాగంగా బారోనెస్ వర్మ ప్రసంగిస్తూ.. సాంస్కృతిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడంతో పాటు, అందులో శాంతిని పెంపొందించడానికి దోహద పడే అంశాల గురించి ప్రస్తావించారు. ఇందుకు వివిధ దేశాలకు చెందిన భిన్న సంస్కృతులను ఏకతాటిపై తీసుకురావడానికి చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. ఇది ప్రస్తుత సమాజంలో ఆహ్వానించదగ్గ పరిణామమని ఆమె స్పష్టం చేశారు.