
దేశ వ్యతిరేక కార్యకలాపాల వల్లే
ఆమెకు పంపిన లేఖలో కేంద్రం
అప్రజాస్వామిక చర్యలు: కౌల్
లండన్: భారత సంతతికి చెందిన నితాషా కౌల్ అనే విద్యావేత్త ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) హోదాను కేంద్రం రద్దు చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘పలు అంతర్జాతీయ, సోషల్ మీడియా వేదికల్లో భారత్‌కు వ్యతిరేకంగా రాస్తున్నారు. ప్రసంగాలు చేస్తున్నారు.
దేశ సార్వభౌమాధికారాన్ని, దేశంలోని సంస్థలను లక్ష్యంగా చేసుకుని దురుద్దేశంతో, వాస్తవాలను పూర్తిగా విస్మరించి, చరిత్ర పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చింది’’ అని స్పష్టం చేసింది.
ఈ మేరకు కేంద్రం పంపిన లేఖను కౌల్ ఆదివారం సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘విద్యా రంగంలో చేసిన కృషికి నన్నిలా శిక్షించారు. అత్యంత దారుణం. మోదీ ప్రభుత్వ మైనారిటీ వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలకు మరో నిదర్శనం’’ అంటూ ఆరోపణలు గుప్పించారు. విదేశీ పౌరసత్వమున్న భారత సంతతి వ్యక్తులకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక హోదా ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా. ఇది జీవితకాలపు వీసా. ఇది ఉన్నవారు భారత్‌ను సందర్శించడానికి ఎలాంటి పరిమితులూ ఉండవు.
విమానాశ్రయం నుంచే బహిష్కరణ
‘ప్రజాస్వామ్యం– రాజ్యాంగ విలువలు’ అంశంపై ప్రసంగించేందుకు కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది కౌల్‌ను బెంగళూరుకు ఆహ్వానించింది. విమానాశ్రయంలో దిగగానే అధికారులు ఆమెను అడ్డుకుని 24 గంటల్లోనే బ్రిటన్‌కు తిప్పి పంపారు. ఆరెస్సెస్‌ను విమర్శి స్తున్నందుకే ఇలా చేశారని ఆమె అప్పట్లో ఆరోపించారు. ‘‘కర్నాటక ప్రభుత్వం ఆహ్వానంపై వస్తే కేంద్రం నాకు ప్రవేశం నిరాకరించింది.
నా దగ్గర బ్రిటన్ పాస్‌పోర్ట్, ఓసీఐ కార్డు, ఇలా చెల్లుబా టయ్యే పత్రాలన్నీ ఉన్నాయి. ఇది నాకు మాత్రమే కాదు, నన్ను ఆహ్వానించిన బీజేపీ యేతర (కాంగ్రెస్) ప్రభుత్వానికి కూడా జరిగిన అవమానం’’ అని ఆక్షేపించారు. భారత్ విచ్ఛి న్నం కావాలని కోరుకునే కౌల్ వంటి ఓ పాక్ సానుభూ తిపరురాలిని ఆహ్వానించడం దారు ణమని బీజేపీ అప్పట్లో ఆరోపించింది. ఇలాంటి చర్యలతో కర్నాటక కాంగ్రెస్ సర్కారు దేశ ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తోందంటూ మండిపడింది.
ఎవరీ కౌల్?
నితాషా కౌల్ లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయంలో పాలిటిక్స్, అంతర్జాతీయ సంబంధాల విభాగంలో అధ్యాపకురాలు. జమ్మూ కశ్మీర్ నుంచి యూపీలోని గోరఖ్‌పూర్‌కు వలస వచ్చిన కశ్మీరీ పండిట్ల కుటుంబంలో జన్మించారు. ఢిల్లీలో పెరిగారు. ఢిల్లీ వర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ ఆనర్స్ చేశారు. 1997లో హల్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేయడానికి 21 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ వెళ్లారు. ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్, ఆర్థిక, తత్వశాస్త్రాల్లో పీహెచ్‌డీ చేశారు. బ్రిస్టల్ బిజినెస్ స్కూల్‌లో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేశారు. 2010లో భూటాన్‌లోని రాయల్ థింఫు కళాశాలలో సృజనాత్మక రచనలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆమె రచయిత్రి, కవయిత్రి కూడా.