
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాలీవుడ్‌లో మాత్రమే కాదు.. టాలీవుడ్‌లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా ఓ అభిమాని ఆయనపై ప్రేమను వినూత్నంగా చాటుకున్నాడు. ఈనెల 21న మోహన్ లాల్ పుట్టినరోజు కావడంతో ఒక రోజు ముందుగానే ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. జాక్ ఫ్రూట్స్‌తో ఆయన చిత్రపటాన్ని రూపొందించాడు.
జాక్ ఫ్రూట్ భాగాలను ఉపయోగించి డా విన్సీ సురేశ్ అనే ఆర్టిస్ట్ మోహన్ లాల్ చిత్రపటాన్ని రూపొందించాడు. దాదాపు 65 రకాల జాక్ ఫ్రూట్‌లతో ఈ చిత్రపటాన్ని తయారు చేశారు. ఆకుపచ్చ, పసుపు, నారింజ షేడ్స్ లో జాక్ ఫ్రూట్ ఆకులతో మోహన్ లాల్ ఫోటోను అలంకరించారు. ఈ చిత్రపటాన్ని త్రిస్సూర్ వేలూర్‌లోని ఆయుర్ జాక్ ఫ్రూట్ ఫామ్‌లో రూపొందించారు. దాదాపు ఎనిమిది అడుగుల వెడల్పు, రెండు అడుగుల ఎత్తుతో ఈ చిత్రపటాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. దీని కోసం దాదాపు ఐదు గంటల సమయం పట్టినట్లు తెలుస్తోంది.

కాగా.. ఈ ఏడాది మోహన్ లాల్ ఎంపురాన్-2 మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత మోహన్ లాల్, శోభన జంటగా తుడురుమ్ అనే మూవీ కూడా విడుదలైంది. ఈ సినిమాకు సైతం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.