
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 19) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మతో గొడవకు దిగినందుకు గానూ లక్నో బౌలర్ దిగ్వేశ్ సింగ్ రాఠీపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చర్యలు తీసుకుంది. రాఠీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధించింది. రాఠీ కవ్వింపులకు ప్రతిగా స్పందించిన అభిషేక్ కూడా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతకు గురయ్యాడు. అభిషేక్ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా జమయ్యింది.
ABHISHEK vs DIGVESH MOMENT 🤯 pic.twitter.com/oEfs0LWhoe
— Johns. (@CricCrazyJohns) May 19, 2025
సస్పెన్షన్ కారణంగా రాఠీ లక్నో తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో (మే 22న గుజరాత్‌తో) ఆడలేడు. ఈ సీజన్‌లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 23 ఏళ్ల రాఠీ.. సీజన్ ప్రారంభం నుంచి చాలా సార్లు ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ఉల్లంఘించి గవర్నింగ్ కౌన్సిల్ ఆగ్రహానికి గురయ్యాడు. తాజా ఘటనతో ఈ సీజన్‌లో రాఠీ డీ మెరిట్ పాయింట్ల సంఖ్య ఐదుకు చేరింది. ఈ కారణంగా అతనిపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. ఓ సీజన్‌లో మూడు సార్లు కోడ్‌ను ఉల్లంఘిస్తే ఓ మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తారు. రాఠీ ఈ సీజన్‌లో పంజాబ్ (1), ముంబైతో (2) జరిగిన మ్యాచ్‌ల్లోనూ కోడ్‌ను ఉల్లంఘించి డిమెరిట్ పాయింట్లు మూటగట్టుకున్నాడు.
కాగా, దిగ్వేశ్ రాఠీ వికెట్ తీసిన ప్రతిసారి నోట్ బుక్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం మేనరిజంగా పెట్టుకున్నాడు. ఎవరి వికెట్ తీసినా ఇదే తంతు కొనసాగిస్తూ వచ్చాడు. తాజాగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ వికెట్ తీసిన ఆనందంలో ఇదే పని చేశాడు. అయితే ఈసారి రాఠీ నోట్ బుక్ సెలబ్రేషన్స్ కాస్త శృతి మించాయి. అభిషేక్‌తో అతను చాలా అవమానకరంగా ప్రవర్తించాడు. వికెట్ తీశాక వెళ్లు.. వెళ్లు అన్నట్లు సైగ చేశాడు. దీంతో పాటు నోటికి కూడా పని చెప్పాడు.
రాఠీ ఇంతలా రియాక్డ్ కావడానికి అంతకుముందు అభిషేక్ బాదిన బాదుడే కారణం. రవి బిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్‌లో అభిషేక్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. ఆతర్వాత ఓవర్‌లో బంతినందుకున్న రాఠీ.. అభిషేక్‌ను తొలి బంతికే ఔట్ చేశాడు. ఈ క్రమంలో నోట్ బుక్ సెలబ్రేషన్స్ చేసుకుని ఓ మ్యాచ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం రాజీవ్ శుక్లా రాజీ కుదుర్చడంతో అభిషేక్, రాఠీ కరచాలనం చేసుకుని, కలియతిరగడం కొసమెరుపు.
ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమిపాలైన లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (65), ఎయిడెన్ మార్క్రమ్ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అభిషేక్ శర్మ తన సహజ శైలిలో ఊచకోత (20 బంతుల్లో 59; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) కోసి సన్‌రైజర్స్ గెలుపుకు బలమైన పునాది వేశాడు. మధ్యలో ఇషాన్ కిషన్ (35), క్లాసెన్ (47), కమిందు మెండిస్ (32 రిటైర్డ్ హర్ట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడగా.. అనికేత్ వర్మ (5 నాటౌట్), నితీశ్ రెడ్డి (5 నాటౌట్) మ్యాచ్‌లను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ 2, విలియమ్ ఓరూర్కీ, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.