
అమెరికాలోని వాషింగ్టన్‌లో పర్వతారోహణ చేస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఇందులో భారత సంతతికి చెందిన విష్ణు ఇరిగిరెడ్డితో సహా ముగ్గురు పర్వతారోహకులు మరణించారు. అయితే, నాల్గవ సహచరుడు తీవ్రంగా గాయపడ్డాడు. పర్వతారోహణంపై ఆసక్తితో ఎంతో ఉత్సాహంగా మొదలైన వీరి ప్రయాణం విషాదాంతమైంది. దీంతో బాధిత కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి.
పశ్చిమ ఉత్తర అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలోని నార్త్ కాస్కేడ్స్ పర్వతాలపై ఈ ప్రమాదంచోటు చేసుకుంది. ఈ క్లైంబింగ్ ప్రమాదంలో మరణించిన ముగ్గురిలో భారత సంతతికి చెందిన టెక్కీ విష్ణు ఇరిగిరెడ్డి కూడా ఉన్నారు. సియాటిల్ నివాసి అయిన 48 ఏళ్ల విష్ణు తన ముగ్గురు స్నేహితులు టిమ్ న్గుయెన్ (63), ఒలెక్సాండర్ మార్టినెంకో (36) ఆంటన్ సెలిక్‌లతో (38), త్సేలిఖ్ లతో కలిసి శనివారం కాస్కేడ్స్‌లోని నార్త్ ఎర్లీ వింటర్స్ స్పైర్ ప్రాంతాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగిందని NBC న్యూస్ నివేదించింది. అయితే ఈ ఘోర ప్రమాదంనుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక అధిరోహకుడు త్సేలిఖ్,తన ముగ్గురు స్నేహితుల మరణానికి దారి తీసిన ప్రమాదం గురించి అధికారులకు తెలియజేయడానికి 64 కిలోమీటర్లు ప్రయాణించాడు. త్సేలిఖ్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు ,అంతర్గత రక్తస్రావం, మెదడు గాయానికి చికిత్స పొందుతున్నాడు.
అయితే పైకి ఎక్కుతున్నపుడు తుఫాను ప్రమాదాన్ని గుర్తించిన వీరు వెనక్కి తగ్గినప్పటికీ ఫలితం లేకపోయింది. కిందికి దిగుతున్న సమయంలో జట్టు యాంకర్ పాయింట్ విఫలం కావడంతో వారు 200 అడుగుల కిందకు పడిపోయారని క్లైంబింగ్ వెబ్‌సైట్ నివేదించింది. ఈ ప్రమాదంలోపై విష్ణు స్నేహితులు, కుటుంబ సభ్యులు తీవ్ర విచారాన్ని వ్యకతం చేశారు. విష్ణు అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడని ప్రకృతిని బాగా ఇష్టపడేవారని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు సియాటిల్‌లో అత్యంత నైపుణ్యమున్న టెక్నీషియన్లలో గొప్పవాడని, తనదైన విలువలతో జీవితాన్ని నిర్మించు కున్నాడంటూ కంట తడిపెట్టుకున్నారు. విష్ణు గౌరవార్థం అతని స్నేహితులు , కుటుంబ సభ్యులు రెండు లాభాపేక్షలేని సంస్థలకు విరాళాలు అందించనున్నారు. అలాగే మే 22 వరకు ఆ స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వాలని వారు ఇతరులకు విజ్ఞప్తి చేశారు.
విష్ణు గ్రేటర్ సియాటిల్ ప్రాంతంలోని టెస్ట్ పరికరాల తయారీ సంస్థ ఫ్లూక్ కార్పొరేషన్‌లో ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నాడు. విష్ణు గొప్ప టీం లీడర్ అనీ, ఆయన మరణం తీరని లోటు అంటూ కంపెనీ కూడా నివాళులర్పించింది. నార్త్ కాస్కేడ్స్‌లోని లిబర్టీ బెల్ సమూహంలోని గ్రానైట్ శిఖరం, నార్త్ ఎర్లీ వింటర్స్ స్పైర్, అనుభవజ్ఞులైన పర్వాతారోహకులకు ప్రసిద్ధి చెందింది.