
బెంగళూరు: ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే అందుకు అనువైన రోడ్లు ఎంతో అవసరం. అయితే భారతదేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. గుంతలు, గతుకులు, వర్షం పడితే చాలు నీటితో నిండిపోయే రోడ్లు బెంగళూరు వాసులను ఇబ్బందుకు గురిచేస్తున్నాయి. ఈ ఇక్కట్లపై స్పందించిన బెంగళూరుకు చెందిన దివ్య కిరణ్(43) బృహత్ బెంగళూరు మహానగరపాలిక(Greater Bengaluru Metropolitan City) (బీబీఎంపీ)కి నోటీసులు పంపించారు.
బెంగళూరు నగరంలోని రోడ్లపై ప్రయాణిస్తున్న కారణంగా తనకు శారీరక బాధలు ఎదురవడమే కాకుండా, మానసిక సమస్యలు కూడా తలెత్తాయని పేర్కొంటూ ఆయన బీబీఎంపీకి రూ. 50 లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించారు. నగరానికి చెందిన సామాన్య పౌరుడినైన తాను పన్నులను చెల్లిస్తూ, నగర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తున్నానని కిరణ్ పేర్కొన్నారు. అయితే గతుకుల రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు ఏర్పడే కదలికల కారణంగా తాను తీవ్రమైన మెడ, వీపు నొప్పులకు లోనయ్యానని పేర్కొన్నాడు. ఈ నొప్పుల నుంచి ఉపశమనానికి ఐదు సార్లు ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్(Orthopedic specialist)లను సంప్రదించాల్సి వచ్చిందని కిరణ్ ఆ నోటీసులో పేర్కొన్నాడు.
నగర రోడ్లపై ప్రయాణిస్తున్న కారణంగా తన క్లయింట్ కిరణ్ పలు ఇబ్బందుకు ఎదుర్కొంటున్నాడని ఇంజక్షన్లు, చికిత్సలు, నొప్పి నివారణ మందులు.. అతని రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయాయని అడ్వకేట్ కేవీ లవీన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దివ్య కిరణ్ ఆటోలు, టూ-వీలర్‌లలో ప్రయాణించడం అసాధ్యంగా మారిందని, క్యాబ్‌లు కొంచెం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, రోడ్ల దుస్థితి కారణంగా అవి కూడా అతని బాధను తప్పించలేకపోతున్నాయని లవీన్ పేర్కొన్నారు. నగరంలోని రోడ్ల పరిస్థితి అతని వృత్తిపరమైన జీవితాన్ని దెబ్బతీసిందని ఆరోపించారు.
తాను ఎదుర్కొంటున్న సమస్యలకు బీబీఎంపీ నిర్లక్ష్యమే కారణమని దివ్య కిరణ్ ఆరోపించారు. దీనికి ప్రతిగా తనకు రూ. 50 లక్షల పరిహారాన్ని 15 రోజుల్లోగా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ దీనిపై స్పందించకుంటే పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (పిల్) కూడా దాఖలు చేస్తాననని కిరణ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: బ్రిటిష్ కశ్మీరీ ప్రొఫెసర్ ఓసీఐ రద్దు.. కారణమిదే..