
లండన్: భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నవారిపై ప్రభుత్వం దృష్టిసారించింది. తాజాగా లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన బ్రిటిష్ అకాడమిక్ నితాషా కౌల్(Nitasha Kaul)కు చెందిన ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) స్టేటస్‌ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా సాయంతో వెల్లడించారు.
తాను భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నానని, ప్రత్యేకించి తన రచనలు, ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులు.. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని భారత ప్రభుత్వం తనపై ఆరోపణలు గుప్పించిందని నితాషా కౌల్ ఆ పోస్టులో పేర్కొన్నారు. గోరఖ్‌పూర్‌లో జన్మించిన కౌల్ కశ్మీరీ పండిట్, బ్రిటిష్ పౌరురాలు. ఆమె వెస్ట్‌మిన్‌స్టర్ విశ్వవిద్యాలయం(University of Westminster)లో సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెమోక్రసీ (సీఎస్‌డీ) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రచయిత్రిగా, యాక్టివిస్ట్‌గా కూడా పనిచేస్తున్నారు. భారత ప్రభుత్వం తన ఓసీఐ స్టేటస్‌ను రద్దు చేయడాన్ని క్రూరమైన, ప్రతీకార చర్యగా ఆమె అభివర్ణించారు.
2024 ఫిబ్రవరిలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ‘రాజ్యాంగం, భారత ఐక్యత" అనే అంశంపై ఒక సమావేశంలో ప్రసంగించేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న నితాషాను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని, లండన్‌కు తిరిగి పంపించారు. ఆమె రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)ను విమర్శించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు నాడు తెలిపారు. భారత ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో నితాషా కౌల్.. భారతదేశ సార్వభౌమత్వంపై దురుద్దేశపూరితంగా, వాస్తవాలు లేదా చరిత్రను పట్టించుకోకుండా రచనలు, ప్రసంగాలు, జర్నలిస్టిక్ కార్యకలాపాటు సాగించినట్లు పేర్కొంది. లండన్‌లోని భారత హైకమిషన్ నిర్దేశించిన ఓసీఐ నిబంధనల ప్రకారం, భారత ప్రభుత్వం ఏ వ్యక్తి కి చెందిన ఓసీఐ రిజిస్ట్రేషన్‌ను అయినా కొన్ని నిర్దిష్ట కారణాలతో రద్దు చేయవచ్చు.
ఇది కూడా చదవండి: ప్రముఖ శాస్త్రవేత్త నార్లికర్ కన్నుమూత.. సాగించిన పరిశోధనలివే..