
పూణే: ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లికర్(Scientist Jayant Vishnu Narlikar) మహారాష్ట్రలోని పూణేలో నేడు (మే 20) కన్నుమూశారు. భారతదేశంలో ఖగోళ భౌతిక శాస్త్ర పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడంలో నార్లికర్ గణనీయమైన పాత్ర పోషించారు. విశ్వోద్భవ శాస్త్రం, బిగ్ బ్యాంగ్‌కు ప్రత్యామ్నాయ సిద్ధాంతాల రూపకల్పనలో నార్లికర్ విశేష కృషి చేశారు.
పూణేలోని ఇంటర్-యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్(Inter-University Center for Astronomy and Astrophysics) (ఐయూసీఏఏ) వ్యవస్థాపక డైరెక్టర్‌గా పేరొందారు. 1938, జూలై 19న మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జన్మించిన ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అక్కడ ఆయన ఫ్రెడ్ హోయిల్‌తో కలిసి హోయ్ల్-నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. ఇది సాంప్రదాయ విశ్వోద్భవ నమూనాలను సవాలు చేసింది.
తన శాస్త్రీయ రచనలతో పాటు నార్లికర్ పలు సంక్లిష్టమైన శాస్త్రీయ భావనలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పుస్తకాలు, వ్యాసాలు రాశారు. ఆయన మరాఠీలో సైన్స్ ఫిక్షన్ కూడా రాశారు. నార్లికర్ రచనలు కొత్త తరాల పరిశోధకులకు స్ఫూర్తినిస్తున్నాయి. ఖగోళ భౌతిక శాస్త్ర రంగాల్లో నార్లికర్ చేసిన కృషిగా గాను ఆయన పద్మభూషణ్ (1965), పద్మవిభూషణ్ (2004), మహారాష్ట్ర భూషణ్ (2010) తదితర ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1980ల చివరలో ఆయన ప్రముఖ టీవీ షో ‘కాస్మోస్: ఎ పర్సనల్ వాయేజ్’లో కనిపించారు. ఇది ఖగోళ భౌతిక శాస్త్రంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న గుర్తింపును మరోమారు గుర్తు చేసింది.
ఇది కూడా చదవండి: World Bee Day... అప్పుడు మనిషి జీవితం నాలుగేళ్లే!