
తేనె.. ఎంత రుచికరమో అంత ఆరోగ్యదాయకం. ప్రతిరోజూ తగిన మోతాదులో తేనె(Honey)ను తీసుకోవడం ద్వారా పలు అనారోగ్యాల బారి నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. భూమిమీద కష్టించే జీవుల జాబితాలో తేనెటీగలు ముందుంటాయి. ఒకవైపు పర్యావరణాన్ని కాపాడుతూ, మరోవైపు మనకు ఆరోగ్యాన్ని అందిస్తున్న తేనెటీగలకు సంబంధించిన చాలా విషయాలు మనకు తెలియదు. రాయల్ జియోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ లండన్ సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం భూమి మీద తేనెటీగలు లేకపోతే మనిషి జీవితం దుర్భరమవుతుంది. నేడు (మే 20) ప్రపంచ తేనేటీగల దినోత్సవం. ఈ సందర్భంగా తేనెటీగలు పర్యావరణానికి అందించే సాయాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది.
భూమి మీద బతికే హక్కు మనిషికి ఎంత ఉందో, మిగతా జీవరాశులకూ అంతే ఉంది. అయితే మనిషి తన అవసరాల కోసం మిగిలిన జీవుల ఉనికికి ముప్పు వాటిల్లే పనులు చేస్తున్నాడు. జీవ వైవిధ్యం(Biodiversity) కరువైతే ప్రకృతిలో సమతుల్యత దెబ్బతింటుంది. చివరికి ఆ ప్రభావం మనిషి మీదే పడుతుంది. రాయల్ జియోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ లండన్ సైంటిస్టులు చెప్పినదాని ప్రకారం తేనెటీగలు లేని భూమి మీద మనిషి కేవలం నాలుగేళ్లు మాత్రమే బతకగలడు. మిగిలిన జీవులు కూడా దాదాపు అంతరించిపోయే దశకు చేరుకుంటాయి. నాడు ప్రముఖ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ కూడా ‘తేనెటీగలు లేకపోతే మనిషి నాలుగేళ్ల కన్నా ఎక్కువ కాలం జీవించడం కష్టం’ అని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంఖ్య అంతకంతకూ క్షీణిస్తోంది. దాదాపు 90 శాతం తేనెటీగలు ఇప్పటికే అంతరించిపోయాయి. ప్రస్తుతం పదిశాతం మాత్రమే మిగిలాయి. భవిష్యత్తులో తేనెటీగలను ల్యాబ్‌లలో ప్రత్యేకంగా పెంచుకోవావల్సిన పరిస్థితులు ఏర్పడేలా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచంలో పండించే 100 రకాల పంటలలో.. 90 రకాల పంటలు ఫలదీకరణం చెందాలంటే తేనెటీగలు ఎంతో అవసరం. దీని ప్రకారం చూస్తే, అధికశాతం శాతం వ్యవసాయం తేనెటీగల వల్లే జరుగుతోందని చెప్పుకోవచ్చు.
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా సెల్ ఫోన్ వినియోగం మరింతగా పెరిగింది. సెల్ ఫోన్ సిగ్నల్స్(Cell phone signals) తేనెటీగలకు హాని కలిగిస్తున్నాయి. అవి తాము కట్టుకున్న గూడుకు వెళ్లే దారిని మర్చిపోయేలా చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో తేనెటీగలు మరణిస్తున్నాయని పలు పరిశోధనల్లో తేలింది. మన పర్యావరణ వ్యవస్థలను సజీవంగా ఉంచడంలో తేనెటీగలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉంది.
ఇది కూడా చదవండి: Meghalaya: మూక దాడి.. 15 ట్రక్కులు ధ్వంసం