
టోక్యో: ఇన్‌ఫ్లుఎంజా (ఫ్లూ) మహమ్మారితో జపాన్ అతలాకుతలమవుతోంది. సుమారు ఐదు వారాలుగా ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఫ్లూ కేసుల పెరుగుదల దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దారితీసింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నవారు ఫ్లూ బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రజలంతా ఫ్లూ టీకాలు తీసుకోవాలని, ఆరోగ్య రక్షణ చర్యలను పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
ఆస్పత్రులు కిటకిట
ఈ ఫ్లూ వ్యాప్తి.. జపాన్‌లో కోవిడ్-19 తరహా పరిస్థితులను తలపిస్తోంది. ఆస్పత్రులన్నీ బాధితులతో నిండిపోయాయి. బాధితులు ఆస్పత్రుల బయట చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైద్య సిబ్బంది కొరత ప్రస్తుత పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నాలుగు వేలకు మించిన ఇన్‌ఫ్లుఎంజా బాధితులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అంతకు ముందు వారంతో పోలిస్తే కేసులలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ఫ్లూ లక్షణాలు కలిగిన బాధితులు వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్యశాఖ అధికారులు సలహా ఇస్తున్నారు.
పాఠశాలలు మూసివేత
ఈ అంటువ్యాధి ప్రజల సాధారణ జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇన్‌ఫ్లుఎంజా కేసుల పెరుగుదలతో దేశవ్యాప్తంగా 135 పాఠశాలలు, పిల్లల సంరక్షణ కేంద్రాలు తాత్కాలికంగా మూసివేశారు. యమగాట ప్రిఫెక్చర్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలోని 36 మంది విద్యార్థులలో 22 మందికి ఫ్లూ లక్షణాలు కనిపించడంతో పాఠశాలను మూసివేశారు. సంక్రమణ మరింతగా వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు విద్యాశాఖ అధికారులు పాఠశాలను తాత్కాలికంగా మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నారు.
నిపుణుల హెచ్చరికలు
హక్కైడోలోని హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ యోకో సుకామోటో మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం ఫ్లూ వేవ్ అసాధారణంగా, ముందుగానే దూకుడుగా ఉందని హెచ్చరించారు. మారుతున్న వాతావరణం కారణంగా ఇటువంటి పరిణామాలు సర్వసాధారణం అవుతున్నాయన్నారు. గ్లోబల్ ట్రావెల్ నమూనాలు ఇన్‌ఫ్లుఎంజా జాతులు వ్యాప్తి చెందడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. జాతీయ సగటు ఫ్లూ రోగుల సంఖ్య ఇప్పుడు అంటువ్యాధి స్థాయిలను అధిగమించింది, ఒకినావా, టోక్యో, కగోషిమా అత్యంత ప్రభావిత ప్రాంతాలలో ఉన్నాయి.
పర్యాటకులకు సూచనలు
ఆరోగ్యశాఖ అధికారులు ఇన్ఫ్లుఎంజా టీకా అవసరాన్ని మరోమారు తెలియజేస్తున్నారు. టీకాలు వేయించుకోవడం, మాస్క్ ధరించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, ఇళ్లలో వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, వీలైనంత సమయం ఇంట్లోనే ఉండడంలాంటి నివారణ చర్యలు ఫ్లూ వ్యాప్తిని నిరోధిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. జపాన్‌కు వచ్చే పర్యాటకులు పరిశుభ్రతా చర్యలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రయాణ ఆంక్షలు లేనప్పటికీ, సంక్రమణను అరికట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది.