కిమ్‌ చేతిలో బ్రహ్మాస్త్రం!  | Kim Jong Un oversees parade with new Hwasong-20 ICBM | Sakshi
Sakshi News home page

కిమ్‌ చేతిలో బ్రహ్మాస్త్రం! 

Oct 12 2025 4:33 AM | Updated on Oct 12 2025 4:33 AM

Kim Jong Un oversees parade with new Hwasong-20 ICBM

ఖండాంతర అణు క్షిపణి హసాంగ్‌–20 సిద్ధం   

ఉత్తర కొరియా మిలటరీ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణ  

సియోల్‌: ఉత్తర కొరియా నియంత పాలకుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అణ్వాయుధాలకు పదును పెడుతున్నారు. అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణు వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థ ‘హసాంగ్‌–20’ను సిద్ధం చేశారు. అధికార వర్కర్స్‌ పార్టీ 80వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి రాజధాని పాంగ్‌యాంగ్‌లో అట్టహాసంగా జరిగిన భారీ మిలటరీ పరేడ్‌లో ఈ ఇంటర్‌కాంటినెంటల్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌(ఐసీబీఎం) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

ఈ ఆయుధం ప్రజలకు దర్శనమివ్వడం ఇదే తొలిసారి. కిమ్‌ చేతిలో ఇదొక బ్రహ్మాస్త్రమని ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా అభివరి్ణంచింది. అమెరికాతోపాటు ఆసియాతోని శత్రుదేశాలను భయపెట్టడమే లక్ష్యంగా ‘హసాంగ్‌–20’ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్షిపణిని ఇంకా పరీక్షించలేదు. మరికొన్ని రోజుల్లో టెస్టు చేయబోతున్నట్లు సమాచారం. మిలటరీ పరేడ్‌కు చైనా, రష్యా, వియత్నాం తదితర దేశాల ముఖ్యనేతలు, అధికారులు సైతం హాజరయ్యారు. 

ఉత్తర కొరియా ఆయుధ సంపత్తిని ప్రత్యక్షంగా వీక్షించారు. శత్రువులను మట్టికరిపించేలా తమ సైన్యాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతామని కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. అమెరికా, దక్షిణ కొరియా పేర్లను నేరుగా ప్రస్తావించలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు సహకరిస్తున్న ఉత్తర కొరియా సైనికులను కిమ్‌ ప్రశంసించారు. 

అంతర్జాతీయ న్యాయం, నిజమైన శాంతి కోసం జరుగుతున్న యుద్ధంలో వారు అద్భుతమైన పోరాట స్ఫూర్తిని కనబరుస్తున్నారని కొని యాడారు. తాము అధిగమించలేని అవరోధాలు, సాధించలేని విజయాలు ఏవీ లేవని వ్యాఖ్యానించారు. ఒక బలమైన శక్తిగా ఈరోజు ప్రపంచం ఎదుట సగర్వంగా నిలిచామని పేర్కొన్నారు. మిలటరీ పరేడ్‌లో లాంగ్‌–రేంజ్, షార్ట్‌–రేంజ్‌ స్ట్రాటజిక్‌ క్రూయిజ్‌ మిస్సైళ్లు, డ్రోన్‌ లాంచ్‌ వెహికల్స్, డ్రోన్లు, యుద్ధ ట్యాంక్‌లు సైతం ప్రదర్శించారు.  

ఏమిటీ హసాంగ్‌–20?
మిలటరీ పరేడ్‌లో 11 ఇరుసుల భారీ లాంచర్‌ ట్రక్కుపై హసాంగ్‌–20 క్షిపణిని ప్రదర్శించారు. కార్బన్‌ ఫైబర్‌తో రూపొందించిన ఈ క్షిపణి ఇంజిన్‌ 1,971 కిలోన్యూటన్ల థ్రస్ట్‌ను ఉత్పత్తి చేయగలదు. సుదూరంలో ఉన్న లక్ష్యాలను సులభంగా ఛేదించగలదు. ఒకేసారి బహుళ అణు వార్‌హెడ్లను మోసుకెళ్లేలా డిజైన్‌ చేశారు. అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలను తుత్తునియలు చేయగలదని అంటున్నారు. 

భవిష్యత్తులో అమెరికా నుంచి ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టడానికి హసాంగ్‌–20ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఈ మిస్సైల్‌ కనీస రేంజ్‌ ఏకంగా 15,000 కిలోమీటర్లు(9,300 మైళ్లు) కావడం గమనార్హం. ఉత్తర కొరియా నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ మధ్య దూరం దాదాపు 11,000 కిలోమీటర్లు. అంటే హసాంగ్‌–20తో అమెరికా రాజధానిని టార్గెట్‌ చేయొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement