నిఘా నుంచి దాడి, రక్షణ వరకు యుద్ధ వ్యూహాల ప్రదర్శన
ఈసారి వినూత్నంగా రిపబ్లిక్ వేడుకలు
భైరవ్ కమాండోల అరంగేట్రం
భారత సైనిక శక్తికి ప్రతీకగా నిలువనున్న పరేడ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఈ ఏడాది 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్ సంప్రదాయాలకు భిన్నంగా సాగనుంది. శత్రుదేశంతో యుద్ధం వేళ నిఘా నుంచి దాడి, రక్షణ, వ్యూహాలను ఎలా అమలు చేస్తారనే విషయాలను పరేడ్‌లో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించనున్నారు. దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’తర్వాత నిర్వహిస్తున్న మొదటి రిపబ్లిక్ డే వేడుకలు కావడంతో ఈసారి కర్తవ్య పథ్‌పై భారత సైన్యం నిజమైన యుద్ధరంగ దృశ్యాన్ని ప్రతిబింబించేలా తన యుద్ధపాటవాన్ని ప్రదర్శించనుంది.
కదనరంగాన్ని కళ్ల ముందు సాక్షాత్కరింపజేయనుంది. మొదటిసారిగా పరేడ్‌లో సైనిక దళాలు తమ ఆయుధాలను రణక్షేత్రంలో ఏ తరహాలో అయితే మొహరిస్తారో అదే రీతిలో ప్రదర్శించనున్నాయి. నిఘాకు సంబంధించిన హై మొబిలిటీ వాహనాలు, బ్యాటిల్ ఫీల్డ్ సరై్వలెన్స్ రాడార్లు, డ్రోన్లను ప్రదర్శించనున్నారు. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లను ఆ తర్వాత ప్రదర్శించనున్నారు. అనంతరం భూతలంపై సైనిక దళాలకు గగనతల నుంచి దన్నుగా నిలబడే అపాచీ దాడి హెలికాప్టర్లు, తేలికపాటి యుద్ధ ‘ప్రచండ్’హెలికాప్టర్‌లు కర్తవ్యపథ మీదుగా దూసుకెళ్లి తమ సైనిక పాటవాన్ని ప్రదర్శించనున్నాయి.
ట్యాంకుల బలం...
భూతల యుద్ధాన్ని ముందుండి నడిపించే అత్యంత కీలక టీ–90 యుద్ధ ట్యాంక్‌లు, అర్జున్ యుద్ధ ట్యాంక్, బీఎంపీ–2 ఇన్ఫాంట్రీ కాంబాట్ వాహనాలు, ఎన్‌ఏఎంఐఎస్–2 నాగ్ మిసైల్ వ్యవస్థ పరేడ్‌లో కీలక ఆకర్షణగా నిలవనున్నాయి. భారతదేశంలో తయారైన ఆధునిక ఆయుధ వ్యవస్థలు ఏటీఏజీఎస్ ధను‹Ù, బ్రహ్మోస్ క్షిపణి, ఆకాశ్, బరాక్–8 గగనతల రక్షణ వ్యవస్థలనూ పరేడ్‌లో ప్రదర్శించనున్నారు.
ఆధునిక యుద్ధ సాంకేతికత..
ఈసారి పరేడ్‌లో భవిష్యత్ యుద్ధరీతుల్లో కీలకమైన ఆధునాతన సాంకేతికతలను ప్రదర్శించడంపై ప్రధానంగా దృష్టిసారించారు. ఇంటిగ్రేటెడ్ ఆపరేషనల్ సెంటర్, అన్‌మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్స్, ఆల్–టెర్రెయిన్ వాహనాలు, రోబోటిక్ మ్యూల్స్‌తో లైట్ స్ట్రైక్ వెహికిల్స్, రోబోటిక్ డాగ్స్ తదితరాలు ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సంప్రదాయం– ఆధునికత కలబోతగా ఈసారి జాన్స్‌కర్ పోనీలు, బ్యాక్ట్రియన్ ఒంటెలు, సైనిక డాగ్ స్క్వాడ్ దళాలు, లాజిస్టిక్స్ యూనిట్లతో కలిసి పరేడ్‌లో కవాతు చేయనున్నాయి.
పరేడ్ ముగింపులో ఇన్ఫాంట్రీ దళాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన ‘భైరవ్ లైట్ కమాండో బెటాలియన్’తొలిసారిగా పాల్గొననుంది. ‘ఉంచా కదమ్ తాల్’తో మార్చింగ్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అనంతరం అత్యాధునిక రాఫెల్, సుఖోయ్–30, మిగ్–29 యుద్ధవిమానాలు నింగిలో వైమానిక విన్యాసాలు చేయనున్నాయి. వీటి వెంటే అపాచీ, తేలికపాటి యుద్ధ విమాంన, ఏఎల్‌హెచ్ సహా భారీ సరకు రవాణా విమానాలు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించనున్నాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ కవాతును కేవలం సంబరంగా కాకుండా సమరక్షేత్రానికి నమూనాకు చూపించనున్నారు. ఆధునిక సాంకేతికత, దేశీయ ఆయుధాలు, కొత్త కమాండో దళాలతో భారత రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటనుంది.


