వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించడానికే రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్‌కు తాత్కాలిక అనుమతి ఇచ్చామని అన్నారు. పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరా మార్గాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.
ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. “కొంత ఒత్తిడిని తగ్గించడానికి నేను ప్రయత్నిస్తాను. మా దేశంలో భారీగా చమురు ఉంది. బయటి దేశాల్లో కూడా చాలా చమురు ఉంది. చమురు సరఫరా సమస్య చాలా త్వరగా సర్దుకుంటుంది” అని ట్రంప్ తెలిపారు.
కాగా, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు అంశంపై అమెరికా-భారత్ మధ్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. యుక్రెయిన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ చేయిస్తున్న యుద్ధానికి భారత్ చమురు కొనుగోలు ద్వారా మద్దతు ఇస్తోందని అమెరికా ఆరోపించింది. శాంతి కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కూడా దీని ద్వారా దెబ్బతింటున్నాయని విమర్శించింది.
ఇదీ చదవండి: నీటిలో అంతిమ సంస్కారాలు.. స్కాట్లాండ్ అనుమతి
మరోవైపు, అమెరికాలోని ప్రజలు, వ్యాపారాలు, కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరాలు, మోసాలు, దోపిడీదారులపై విస్తృతంగా చర్యలు తీసుకోవాలని ఫెడరల్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కార్యనిర్వాహక ఆర్డర్లపై డొనాల్డ్ ట్రంప్ ఆదివారం సంతకం చేశారు.
ఆ ఆదేశం ప్రకారం అమెరికా విదేశాంగ కార్యదర్శి విదేశీ ప్రభుత్వాలతో చర్చలు జరిపి, వారి భూభాగాల్లో పనిచేస్తున్న అంతర్జాతీయ నేరస్థులపై చర్యలు తీసుకోవాలని కోరాల‍్సి ఉంటుంది.


