పాకిస్తాన్‌లో చుక్కలు చూపిస్తున్న పెట్రోల్‌.. డీజిల్‌! | Pakistan Petrol And Diesel Prices Jumps To Record Levels By Nearly 20% Amid Global Oil Surge, More Details Inside | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌లో చుక్కలు చూపిస్తున్న పెట్రోల్‌.. డీజిల్‌!

Mar 8 2026 1:30 PM | Updated on Mar 8 2026 4:17 PM

Pakistan petrol diesel prices jumps to record levels

పాకిస్తాన్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను దాదాపు 20 శాతం వరకు పెంచినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.

ఆ దేశ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ టెలివిజన్ ద్వారా దేశ ప్రజలకు  పెట్రోల్‌, డీజిల్‌ పెంపు విషయాన్ని ప్రకటించారు. ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు భారీగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు 55 పాకిస్తాన్ రూపాయలు పెంచి 321.17 రూపాయలకు నిర్ణయించింది. అలాగే డీజిల్ ధరను లీటరుకు 335.86 రూపాయలకు పెంచింది. ఇటీవలి సంవత్సరాల్లో ఇది అతిపెద్ద ధర సర్దుబాట్లలో ఒకటిగా భావిస్తున్నారు.

ద్రవ్యోల్బణంపై ప్రభావం
ఇంధన ధరల పెరుగుదలతో దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలపై ఇది తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగా ఇంధన ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరగడం, దాంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడం సాధారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు
ధరల పెంపు ప్రకటనకు ముందే లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాల్లోని పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపించాయి. కొరత వచ్చే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ముందుగానే ఇంధనం కొనుగోలు చేయడానికి ఎగబడినట్లు రాయిటర్స్‌ కథనం పేర్కొంది.

ప్రభుత్వం హెచ్చరిక
ఇంధన నిల్వలు చేసుకునే ప్రయత్నాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని షెహబాజ్ షరీఫ్ హెచ్చరించారు. దేశంలో తగినంత పెట్రోల్ నిల్వలు ఉన్నప్పటికీ మధ్యప్రాచ్య పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయో తెలియకపోవడంతో వాటిని జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.

చమురు దిగుమతులపై ఆధారపడిన పాకిస్తాన్
పాకిస్తాన్ తన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ సరఫరాలు ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా వస్తాయి. ఇకపై అంతర్జాతీయ చమురు ధరల మార్పులకు అనుగుణంగా ఇంధన ధరలను ప్రతి వారం సమీక్షిస్తామని పాకిస్తాన్ చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement