ఇన్వెస్ట్‌ చేస్తేనే ఇంకా ముందుకు.. | Indian Women Financial Progress Limited Despite Access To Services, Says LXME Founder Preeti Rathi Gupta | Sakshi
Sakshi News home page

ఇన్వెస్ట్‌ చేస్తేనే ఇంకా ముందుకు..

Mar 8 2026 12:46 PM | Updated on Mar 8 2026 3:55 PM

Financial Literacy Can Accelerate Womens Wealth Creation in India

దేశీయంగా మహిళలకు ఆర్థిక సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆర్థిక భద్రత, సంపద సృష్టి అవకాశాలు పరిమితంగానే ఉంటున్నాయని ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫాం ఎల్‌ఎక్స్‌ఎంఈ ఫౌండర్‌ ప్రీతి రాఠీ గుప్తా తెలిపారు. చాలా మంది మహిళల్లో పొదుపు చేసే అలవాటు ఉన్నప్పటికీ మ్యుచువల్‌ ఫండ్స్, ఈక్విటీలు, పెన్షన్లు, లేదా బీమాలాంటి సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటోందని వివరించారు.

చాలా మంది బంగారం, నగదు, చిట్‌ఫండ్స్‌పైనే ఆధారపడుతుంటారని, వీటిపై దీర్ఘకాలంలో రాబడులు అంతంత మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక పురోగతికి సంబంధించి ఎల్‌ఎక్స్‌ఎంఈ–ఈవై ఉమెన్స్‌ ఫైనాన్షియల్‌ ప్రాస్పరిటీ ఇండెక్స్‌ (2026) అధ్యయనం ప్రకారం భారత్‌కి 100కి 28.1 స్కోరు మాత్రమే లభించిందని గుప్తా చెప్పారు. బీమా లేకపోవడం, అసంఘటిత రంగంలో ఉద్యోగం, వేతనజీవులకు మాత్రమే రూపొందించబడిన సిస్టంలు మొదలైనవి మహిళల పురోగతికి ఆటంకాలుగా ఉంటున్నాయని వివరించారు.

అయితే, మహిళలు క్రమంగా ఆర్థిక భద్రతపై మరింతగా దృష్టి పెట్టే ధోరణి పెరుగుతోందని తెలిపారు. ఎమర్జెన్సీ నిధి, బీమా కవరేజీ, ఆర్థిక పరిజ్ఞానం, కమ్యూనిటీ మద్దతు మొదలైనవి మహిళలు పెట్టుబడులు పెట్టడాన్ని ప్రారంభించేందుకు, క్రమంగా సంపద నిర్మించుకునేందుకు తోడ్పడతాయని ఆమె చెప్పారు. పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 40 లక్షల కోట్ల మేర జత కాగలదని గుప్తా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement