మహిళల్లో ఆరోగ్య బీమా కవరేజీ అంతంతే.. | Only 20pc of Women in India Have Adequate Health Insurance Coverage | Sakshi
Sakshi News home page

మహిళల్లో ఆరోగ్య బీమా కవరేజీ అంతంతే..

Mar 8 2026 8:49 AM | Updated on Mar 8 2026 8:52 AM

Only 20pc of Women in India Have Adequate Health Insurance Coverage

దేశీయంగా బీమా కవరేజీ ఉన్న జనాభాలో మహిళల వాటా 47 శాతంగా ఉన్నప్పటికీ, వారికి ఆరోగ్య బీమా కవరేజీ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది. కేవలం 20 శాతం మంది మహిళలకు మాత్రమే తగినంత కవరేజీ ఉంటోందని టాటాఏఐజీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ వెల్లడించింది.

కార్డియాక్, క్యాన్సర్‌లాంటి తీవ్ర అనారోగ్యాల చికిత్స వ్యయాలకు సాధారణంగా రూ. 20 లక్షలకు పైగా కవరేజీ అవసరమవుతోందని పేర్కొంది. కానీ 80 శాతం మందికి ఆ స్థాయిలో బీమా ఉండటం లేదని పేర్కొంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో కార్డియాక్‌ రిసు్కలు ప్రస్తుతం ఎక్కువగా ఉంటున్నాయని 34 శాతం మంది కార్డియాలజిస్టులు వివరించినట్లు తెలిపింది.

అయితే, మహిళల్లో వ్యాధి లక్షణాలను చాలా సందర్భాల్లో సకాలంలో గుర్తించకపోవడం లేదా తప్పుగా నిర్ధారించడం వల్ల చికిత్స అందడంలో జాప్యం చోటు చేసుకుంటోందని సంస్థ తెలిపింది.  ఇక చికిత్స వ్యయాల విషయానికొస్తే.. నేషనల్‌ హెల్త్‌ అకౌంట్స్‌ (2021–22) గణాంకాల ప్రకారం 39.4 శాతం ఖర్చులు జేబునుంచే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటోందని వివరించింది.

ఆరోగ్య బీమా తీసుకోవడం పెరుగుతున్నప్పటికీ దాన్ని కొనసాగించకపోవడం, తక్కువ కవరేజీ తీసుకోవడంలాంటి ధోరణులను బట్టి చూస్తే చాలా మటుకు మహిళలకు తగినంత కవరేజీ ఉండటం లేదనే విషయం తెలుస్తోందని కంపెనీ హెడ్‌ (కన్జూమర్‌ బిజినెస్‌ క్లెయిమ్స్‌) రాజగోపాల్‌ రుద్రరాజు తెలిపారు.

మహిళల్లో క్యాన్సర్, తీవ్ర అనారోగ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక సన్నద్ధత గతంలో కన్నా మరింత కీలకంగా మారిందని పేర్కొన్నారు. తగినంత కవరేజీ తీసుకోవడం, ప్రివెంటివ్‌ హెల్త్‌కేర్‌పై దృష్టి పెట్టడం అవసరమని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement