Tata AIG
-
మహిళల్లో ఆరోగ్య బీమా కవరేజీ అంతంతే..
దేశీయంగా బీమా కవరేజీ ఉన్న జనాభాలో మహిళల వాటా 47 శాతంగా ఉన్నప్పటికీ, వారికి ఆరోగ్య బీమా కవరేజీ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది. కేవలం 20 శాతం మంది మహిళలకు మాత్రమే తగినంత కవరేజీ ఉంటోందని టాటాఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వెల్లడించింది.కార్డియాక్, క్యాన్సర్‌లాంటి తీవ్ర అనారోగ్యాల చికిత్స వ్యయాలకు సాధారణంగా రూ. 20 లక్షలకు పైగా కవరేజీ అవసరమవుతోందని పేర్కొంది. కానీ 80 శాతం మందికి ఆ స్థాయిలో బీమా ఉండటం లేదని పేర్కొంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో కార్డియాక్ రిసు్కలు ప్రస్తుతం ఎక్కువగా ఉంటున్నాయని 34 శాతం మంది కార్డియాలజిస్టులు వివరించినట్లు తెలిపింది.అయితే, మహిళల్లో వ్యాధి లక్షణాలను చాలా సందర్భాల్లో సకాలంలో గుర్తించకపోవడం లేదా తప్పుగా నిర్ధారించడం వల్ల చికిత్స అందడంలో జాప్యం చోటు చేసుకుంటోందని సంస్థ తెలిపింది. ఇక చికిత్స వ్యయాల విషయానికొస్తే.. నేషనల్ హెల్త్ అకౌంట్స్ (2021–22) గణాంకాల ప్రకారం 39.4 శాతం ఖర్చులు జేబునుంచే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటోందని వివరించింది.ఆరోగ్య బీమా తీసుకోవడం పెరుగుతున్నప్పటికీ దాన్ని కొనసాగించకపోవడం, తక్కువ కవరేజీ తీసుకోవడంలాంటి ధోరణులను బట్టి చూస్తే చాలా మటుకు మహిళలకు తగినంత కవరేజీ ఉండటం లేదనే విషయం తెలుస్తోందని కంపెనీ హెడ్ (కన్జూమర్ బిజినెస్ క్లెయిమ్స్) రాజగోపాల్ రుద్రరాజు తెలిపారు.మహిళల్లో క్యాన్సర్, తీవ్ర అనారోగ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక సన్నద్ధత గతంలో కన్నా మరింత కీలకంగా మారిందని పేర్కొన్నారు. తగినంత కవరేజీ తీసుకోవడం, ప్రివెంటివ్ హెల్త్‌కేర్‌పై దృష్టి పెట్టడం అవసరమని వివరించారు. -
టాటా ఏఐజీ కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్
ముంబై: టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘యాక్సిడెంట్ సూపర్ గార్డ్ ప్లస్’ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రమాదాల్లో సమగ్ర ఆర్థిక రక్షణను అందించే వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్ ఇదని, దేశంలో ఏటా ప్రమాదాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. వ్యక్తుల ఆదాయం, అప్పులు, జీవనశైలి రిస్క్‌లకు అనుగుణంగా కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు.ప్రమాద మరణం, శాశ్వత పాక్షిక, పూర్తి వైకల్యంలో ఏక మొత్తంలో బీమా పరిహారం లభిస్తుంది. ప్రమాదాల కారణంగా అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రిలో చేరాల్సి వస్తే అయ్యే ఖర్చులకు రీయింబర్స్మెంట్ పొందొచ్చు. లోన్ షీల్డ్ (రుణాల కోసం), ఈఎంఐ ప్రొటెక్షన్, పెట్‌కేర్ పేరుతో ఐచ్ఛిక కవరేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐదేళ్ల కాల వ్యవధిపై వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఈ ప్లాన్‌ను తీసుకోవచ్చు. వేతన జీవులకు ప్రీమియంలో అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. -
ఆ ఆస్పత్రుల్లో క్యాస్‌లెస్ క్లెయిమ్‌లు బంద్
దేశవ్యాప్తంగా ఉన్న మ్యాక్స్ హెల్త్ కేర్ హాస్పిటల్స్ లో క్యాష్ లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ సదుపాయాన్ని టాటా ఏఐజీ (Tata AIG) జనరల్ ఇన్సూరెన్స్ నిలిపివేసింది. దీనికి ముందు స్టార్ హెల్త్, నివా బుపా ఇప్పటికే మ్యాక్స్ ఆసుపత్రులలో నగదు రహిత క్లెయిమ్ సెటిల్మెంట్లను ఉపసంహరించుకున్నాయి.తమ మధ్య కుదిరిన రెండేళ్ల ఒప్పందం కొనసాగుతుండగానే టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ టారిఫ్‌ల తగ్గింపునకు డిమాండ్ చేసిందని మ్యాక్స్ హెల్త్ కేర్ (Max Hospitals) ఆస్పత్రుల యాజమాన్యం ఆరోపిస్తోంది. "మ్యాక్స్ హెల్త్ కేర్, టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ చర్చలు జరిపి 2025 జనవరి 16 నుండి 2027 జనవరి 15 వరకు అమలులోకి వచ్చే రెండేళ్ల టారిఫ్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అయితే, 2025 జూలైలో టాటా ఏఐజీ అకస్మాత్తుగా సమావేశాన్ని కోరి రేట్ల తగ్గింపును డిమాండ్ చేసింది" అని మ్యాక్స్ హెల్త్ కేర్ ప్రతినిధి తెలిపారు."వారు ఏకపక్షంగా టారిఫ్‌ల తగ్గింపును ప్రతిపాదించారు. నగదు రహిత సేవలను నిలిపివేస్తామని బెదిరించారు. మేము దానికి అంగీకరించకపోవడంతో మా ఆసుపత్రులలో నగదు రహిత సేవలను 2025 సెప్టెంబర్ 10 నుండి నిలిపివేశారు" అని మ్యాక్స్ హెల్త్ కేర్ ప్రతినిధి వివరించారు.ముందస్తు చెల్లింపులు అవసరం లేదుఅయితే రోగులపై ప్రభావాన్ని తగ్గించడానికి, బీమా సంస్థలతో రీయింబర్స్మెంట్లను దాఖలు చేయడంలో వారికి సహాయపడటానికి ఎక్స్ ప్రెస్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు మ్యాక్స్ హెల్త్ కేర్ తెలిపింది. తద్వారా రోగులు మ్యాక్స్ ఆసుపత్రులలో ముందస్తు చెల్లింపులు చేయవలసిన అవసరం లేదంటోంది.ఈ దశలో, ఈ విషయంపై టాటా ఏఐజీతో ఎలాంటి చర్చలు జరపడం లేదని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. టాటా ఏఐజీతో టారిఫ్ వివాదం లేదని, ఛార్జీలలో అదనపు తగ్గింపు ఆచరణీయం కాదని హెల్త్‌కేర్ ప్రొవైడర్ పేర్కొంది. ఇది రోగి భద్రత, సంరక్షణ నాణ్యత రెండింటినీ రాజీ పడేలా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.మ్యాక్స్ ఆస్పత్రుల్లో నివా బుపా (Niva Bupa) , స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ (Star Health) సంస్థలు ఇప్పటికే క్యాస్ లెస్ క్లెయిమ్ సదుపాయాలను ఇప్పటికే నిలిపివేయగా ఇప్పుడు టాటా ఏఐజీ కూడా వాటితో చేరింది. గత మేలో మ్యాక్స్‌తో ఒప్పందం ముగిసిన తరువాత టారిఫ్ చర్చల సమయంలో ఏకాభిప్రాయానికి రావడంలో విఫలమైందని పేర్కొంటూ నివా బుపా 2025 ఆగస్టు 16 నుండి దేశం అంతటా అన్ని మాక్స్ ఆసుపత్రులలో తమ నగదు రహిత క్లెయిమ్‌లను నిలిపివేసింది. మరోవైపు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ (CARE Health Insurance) కూడా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని మ్యాక్స్ ఆసుపత్రులలో నగదు రహిత క్లెయిమ్ సెటిల్మెంట్ను నిలిపివేసింది.ఇదీ చదవండి: పీఎఫ్ విత్‌డ్రా డబ్బు దేనికి వాడుతున్నారు? ఈపీఎఫ్‌వో వార్నింగ్!


