నీటిలో అంతిమ సంస్కారాలు.. స్కాట్లాండ్ అనుమతి | Scotland Becomes First In The UK To Legalise Water Cremation, Offering A Sustainable Alternative To Traditional Funerals | Sakshi
Sakshi News home page

నీటిలో అంతిమ సంస్కారాలు.. స్కాట్లాండ్ అనుమతి

Mar 8 2026 3:35 PM | Updated on Mar 8 2026 5:32 PM

 Scotland Becomes First in the UK to Legalise Water Cremation

సాధారణంగా అంత్యక్రియలు అనగానే మనకు ఖననం చేయడం, దహన సంస్కారాలు నిర్వహించడం మాత్రమే గుర్తుకొస్తాయి. అంత్యక్రియలు అనేవి మతపరమైన, సామాజిక, కుటుంబపరమైన విలువలతో కూడి ఉంటాయి. మనిషి చనిపోయిన తర్వాత కూడా అతడి మృతదేహాన్ని ఎంతో గౌరవంగా సాగనంపాలని భావిస్తాం. ఇప్పటివరకైతే ఖననం, దహన సంస్కారాలు వంటివాటినే పాటిస్తున్నాం. యుగయుగాలుగా ఉన్న ఈ సంప్రదాయాలకు ప్రత్యామ్నాయంగా మరికొన్ని పద్ధతులు వస్తున్నాయని మీకు తెలుసా? 

నీటి ద్వారా అంతిమ సంస్కారాలు (వాటర్ క్రిమేషన్) నిర్వహించుకునే పద్ధతి కూడా ఉంది. తాజాగా, వాటర్ క్రిమేషన్‌కు స్కాట్లాండ్‌ చట్టబద్ధ అనుమతి ఇచ్చింది. యునైటెడ్ కింగ్డమ్‌(యూకే)లో ఇటువంటి అనుమతి ఇచ్చిన తొలి దేశంగా స్కాట్లాండ్ నిలిచింది. దీని ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని, నీటిలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే తక్కువ ఉద్గారాలు విడుదల అవుతాయని స్కాట్లాండ్ భావిస్తోంది. ఈ నిర్ణయం స్కాట్లాండ్‌లోని అంత్యక్రియల చట్టాల్లో 100 సంవత్సరాలకు పైగా కాలంలో జరిగిన అతిపెద్ద సంస్కరణ.  

ఈ పద్ధతిలో ఎలా చేస్తారు?
వాటర్ క్రిమేషన్‌ కోసం స్కాట్లాండ్ పార్లమెంట్ ఆల్కలైన్ హైడ్రోలిసిస్ అనే విధానానికి ఆమోదముద్ర వేసింది. ఈ విధానాన్ని సాధారణంగా వాటర్ క్రిమేషన్ లేదా ఆక్వమేషన్ అని పిలుస్తారు. ఆల్కలైన్ హైడ్రోలిసిస్ అంటే నీరు, ఆల్కలైన్ రసాయనాల సాయంతో శరీర కణజాలాన్ని వేగంగా సహజ విచ్ఛిన్నం చేసే శాస్త్రీయ ప్రక్రియ.

ఈ విధానంలో ఒత్తిడి తట్టుకునే స్టెయిన్‌లెస్ స్టీల్ ఛాంబర్‌లో మృతదేహాన్ని ఉంచుతారు. ఆ ఛాంబర్‌లో 95 శాతం నీరు, 5 శాతం ఆల్కలైన్ రసాయనాల ద్రావణం నింపుతారు. ద్రావణాన్ని సుమారు 150 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు వేడి చేస్తారు. 3 నుంచి 4 గంటల సమయంలో మృదు కణజాలం పూర్తిగా విచ్ఛిన్నం అవుతుంది. చివరగా ఎముక ముక్కలు మాత్రమే మిగులుతాయి. వాటిని ఎండబెట్టి సాంప్రదాయ దహనంలో వచ్చే బూడిదలా తెల్లటి పొడిగా తయారు చేస్తారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రక్రియలో నేరుగా ఉద్గారాలు విడుదల కావు. సాధారణ దహనం కంటే చాలా తక్కువ శక్తి వినియోగం జరుగుతుంది.  కార్బన్ ఫుట్‌ప్రింట్ చాలా తక్కువగా ఉంటుంది. కార్బన్ ఫుట్‌ప్రింట్ అంటే ఒక చర్య వల్ల వాతావరణంలో విడుదలయ్యే మొత్తం గ్రీన్‌హౌస్‌ గ్యాసెస్‌ పరిమాణం.

ప్రజల ఇష్టానికి ప్రాధాన్యం
ఆరోగ్య మంత్రి జెన్నీ మింటో తెలిపిన వివరాల ప్రకారం.. అంతిమ సంస్కారాలు వంటి నిర్ణయాలు చాలా వ్యక్తిగతమైనవి. సంస్కృతి, పర్యావరణ అవగాహన, కుటుంబ విలువలు వంటి అంశాలు వాటిపై ప్రభావం చూపుతాయి. ఇప్పుడు వాటర్ క్రిమేషన్‌ను కూడా తీసుకురావడంతో మృతుల కుటుంబాలకు కొత్త ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంటుంది. 2023లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 84 శాతం మంది ఈ విధానం ప్రవేశపెట్టడానికి సమర్థించారు.

ఈ సేవలు ఎప్పటి నుంచి షురూ? 
చట్టబద్ధ అనుమతి వచ్చినప్పటికీ వాటర్ క్రిమేషన్ సేవలు వెంటనే ప్రారంభం కావు. ఈ కేంద్రాలు ప్రారంభం కావాలంటే మరిన్ని అనుమతులు అవసరం. అధికారుల అంచనా ప్రకారం.. మొదటి వాటర్ క్రిమేషన్ కేంద్రం 9 నెలల్లో ప్రారంభం కావచ్చు.  

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ
వాటర్ క్రిమేషన్ ఇప్పటికే కెనడా, ఐర్లాండ్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో అమలులో ఉంది. వాటర్ క్రిమేషన్ ద్వారా పర్యావరణ ప్రయోజనాలు ఉండడంతో అనేక కుటుంబాలు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నాయి. పర్యావరణ సంస్థలు స్కాట్లాండ్ నిర్ణయాన్ని ప్రశంసించాయి. భవిష్యత్తులో ఇంగ్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి చట్టాలు రావచ్చు.

 

Advertisement
 
Advertisement
Advertisement