ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధ ప్రభావం | Reuters India raises cooking gas prices as Iran war hits supply | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధ ప్రభావం

Mar 8 2026 7:31 AM | Updated on Mar 8 2026 7:31 AM

 Reuters India raises cooking gas prices as Iran war hits supply

గ్యాస్‌ బాట్లింగ్‌ ప్లాంట్లలో ఎల్‌పీజీ స్టాక్‌ నిలిపివేత 

వాణిజ్యావసరాలకు మళ్లించొద్దని ఆదేశాలు 

మరోవైపు సిలిండర్‌ ధరలు రూ.60– 144 పెంపు 

హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ బండ్లపై గుది‘బండ’ 

గ్రేటర్‌పై నెలకు రూ.30 కోట్లు భారం 

లబోదిబోమంటున్న సగటు జీవులు, 

హోటళ్ల యాజమాన్యాలు

సాక్షి, సిటీబ్యూరో: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల ఉద్రిక్తతల ప్రభావం మహా నగరంలోని వాణిజ్య వంట గది వరకూ చేరాయి. గృహాపయోగ వంటగది అవసరాలకు గ్యాస్‌ సరఫరాలో ఎటువంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అత్యవసర ఆదేశాలు తాజాగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్నతరహా పరిశ్రమలపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్‌ కమోడిటీస్‌ యాక్ట్‌ , 1955 కింద చమురు సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌లోని ప్రధాన గ్యాస్‌ బాట్లింగ్‌ ప్లాంట్లలో వాణిజ్య సిలిండర్ల లోడింగ్‌ను తాత్కాలికంగా నిలిచిపోయి గ్యాస్‌ కొరతను సృష్టిస్తోంది. 

హోటళ్లు – రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం 
నగరంలోని ఫుడ్‌ ఇండస్ట్రీపై గ్యాస్‌ ప్రభావం కనిపిస్తోంది. ఇక్కడ సుమారు 70 నుంచి 80 వేలకుపైగా హోటళ్లు, రెస్టారెంట్లు టిఫిన్‌ సెంటర్లు, తోపుడు బండ్లు వాణిజ్య గ్యాస్‌ వినియోగంపైనే ఆధారపడి ఉన్నాయి.  డిమాండ్‌కు సరిపడా సిలిండర్లు సరఫరా కాకపోతుండటంతో డీలర్లు చేతులెత్తేస్తున్నారు. వంటగ్యాస్‌ ఒక్కసారిగా నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ధరలు పెరగగా, మరింత పెరుగుతాయనే ఆశతో కొందరు వ్యాపారులు నిల్వలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కువ శాతం హోటళ్లు, బిర్యానీ పాయింట్లు వాణిజ్య గ్యాస్‌పైనే ఆధారపడి ఉన్నాయి. చిన్నపాటి తోపుడు బండ్లు, ఫంక్షన్ల ఆర్డర్లు తీసుకునే క్యాటరర్లు సిలిండర్ల కోసం డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు.  కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా తగ్గడంతో, బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు కొనాల్సి వస్తోందని హోటల్‌ యజమానులు వాపోతున్నారు. 

రోజువారీ గ్యాస్‌ వినియోగం  
రాష్ట్ర వ్యాప్తంగా నెలకు సగటున 7 నుండి 7.5 లక్షల కమర్షియల్‌ సిలిండర్లు (19 కేజీలు) అవసరమవుతుండగా, ఇందులో దాదాపు 50 – 60 శాతం వాటా కాగా.. ఒక్క గ్రేటర్‌ పరిధిలో ప్రతిరోజూ సుమారు 12,000– 15,000 కమర్షియల్‌ సిలిండర్లు అవసరమవుతాయని అంచనా  ఒక మధ్యస్థ రెస్టారెంట్‌కు రోజుకు 2 నుండి 5 సిలిండర్లు అవసరమైతే, పెద్ద హోటళ్లకు 10 కి పైగా అవసరమవుతాయి. చిన్న టిఫిన్‌ సెంటర్లు, తోపుడు బండ్లు రోజుకు సగటున ఒక చిన్న, సగం పెద్ద సిలిండర్‌ను వినియోగిస్తాయి. కేంద్ర ప్రభుత్వం గహ అవసరాలకు  ప్రాధాన్యతనిస్తూ, కమర్షియల్‌ సరఫరాపై తాత్కాలిక ఆంక్షలు విధించడంతో హోటల్‌ యజమానులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. గ్యాస్‌ ఏజెన్సీల వద్ద సాధారణంగా 2–3 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉంటాయి. సరఫరాలో జాప్యం జరిగితే హోటల్‌ రంగం స్తంభించిపోయే ప్రమాదం ఉంది.  

సిలిండర్ల కోసం ‘పానిక్‌ బుకింగ్‌’ 
మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరమైతే ముడి చమురు సరఫరా నిలిచిపోతుందని, తద్వారా గ్యాస్‌ ధరలు ఆకాశాన్ని తాకుతాయనే ప్రచారం  జోరుగా సాగుతోంది. ఈ భయంతో సామాన్య ప్రజలు తమకు అవసరం లేకున్నా ముందస్తుగా సిలిండర్లను బుక్‌ చేసుకుంటున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement