మహిళల భద్రత అందరి బాధ్యత | Revanth Reddy Launches Stand with Her Campaign for Womens Safety | Sakshi
Sakshi News home page

మహిళల భద్రత అందరి బాధ్యత

Mar 8 2026 6:08 AM | Updated on Mar 8 2026 6:08 AM

Revanth Reddy Launches Stand with Her Campaign for Womens Safety

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్‌. చిత్రంలో శిఖాగోయల్, సాయిదుర్గా తేజ్, శివధర్‌ రెడ్డి, సజ్జనార్‌ తదితరులు

యువత మహిళా రక్షణ అంబాసిడర్స్‌గా మారాలి 

మహిళాభివృద్ధితోనే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సాధ్యం  

స్టాండ్‌ విత్‌ హర్‌ కార్యక్రమ ప్రారంభంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: మహిళల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని.. సమాజంలోని అందరి బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణను దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత రాష్ట్రంగా మార్చడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సొంత కుటుంబ సభ్యులకు ఎక్కడైనా వేధింపులు ఎదురైతే ఎలా స్పందిస్తామో ఇతర ఆడపిల్లల విషయంలోనూ యువత అలాగే స్పందించాలని.. మహిళా రక్షణ అంబాసిడర్లు కావాలని సూచించారు. మహిళలకు అండగా ఉన్న వారికే సమాజంలో మర్యాద ఉంటుందని, అదే ఉద్దేశంతో తెలంగాణ పోలీస్‌శాఖ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ‘స్టాండ్‌ విత్‌ హర్‌’కార్యక్రమాన్ని ప్రారంభించిందని సీఎం రేవంత్‌ చెప్పారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన ‘స్టాండ్‌ విత్‌ హర్‌’కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘స్టాండ్‌ విత్‌ హర్‌’కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీ హీరో సాయిదుర్గతేజ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, డీజీపీ బి.శివధర్‌రెడ్డి, సీఐడీ చీఫ్‌ చారుసిన్హా సహా మహిళా పోలీస్‌ అధికారులు, ఐఏఎస్‌ అధికారులతో కలిసి ‘స్టాండ్‌ విత్‌ హర్‌’బ్రోచర్‌ను సీఎం ఆవిష్కరించారు. 

డిజిటల్‌ క్రైం పెరిగింది.. 
‘రాష్ట్రంలోని మహిళలకు సంపూర్ణమైన రక్షణ కలి్పంచామని ఎవరైనా భావిస్తే అది అసంపూర్తి రక్షణే అని భావిస్తున్నా. గతంలో కొన్ని ప్రాంతాల్లోనో, బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు వేధింపులు ఎదురయ్యేవి. కానీ ఈ రోజుల్లో ఫిజికల్‌ క్రైమ్‌ కంటే ఆన్‌లైన్‌ క్రైమ్‌ పెరిగిపోయింది. మహిళలను వేధించేందుకు కొందరు డీప్‌ఫేక్‌ వీడియోలు తయారు చేస్తున్నారు. వాటిని నియంత్రించడానికి తెలంగాణ సైబర్‌ క్రైం విభాగాన్ని కూడా పటిష్టం చేశాం. మనల్ని మనం సవరించుకొని మహిళలపట్ల మన బాధ్యతల్ని మనం నెరవేర్చాల్సిన సందర్భం వచ్చింది. మహిళల శక్తిసామర్థ్యాలపట్ల మా ప్రభుత్వానికి బలమైన నమ్మకం ఉంది. అందుకే రాష్ట్ర పోలీస్‌ శాఖలోని కీలక విభాగాలకు, ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖలకు మహిళలనే అధికారిణులుగా నియమించాం.

ఆడబిడ్డలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతమైతేనే ఆ రాష్ట్రం లేదా దేశం పురోగతి సాధిస్తుంది’అని సీఎం రేవంత్‌ చెప్పారు. సాయిదుర్గ తేజ్‌ మాట్లాడుతూ సొంత తల్లిని ఎలా గౌరవిస్తామో..అదేవిధంగా ప్రతి మహిళను గౌరవించాలని సూచించారు. బైక్‌పై వెళ్లే సమయంలో హెల్మెట్‌ పెట్టుకోవడం మరవొద్దని సూచించారు. డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారతతోపాటు భద్రత కూడా సామాజిక బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ వారికి అండగా నిలవాలన్నారు. మహిళా భద్రతపై పురుషుల్లో మరింత అవగాహన పెంచేలా స్టాండ్‌ విత్‌ హర్‌ ద్వారా ప్రచారం నిర్వహించనున్నట్లు సీఐడీ అడిషనల్‌ డీజీ చారుసిన్హా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement