
సూడాన్‌లో 53 మంది మృతి
కైరో: సూడాన్ అంతర్యుద్ధంలో అమాయకుల ప్రాణాలు బలవుతూనే ఉన్నాయి. తాజాగా సూడాన్‌లోని ఉత్తర డార్ఫూర్ రాష్ట్రంలోని ఎల్‌ఫాషర్ నగరంలో ఒక శరణార్థి శిబిరంపై ఆ దేశ పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్) జరిపిన దాడిలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 14 మంది పిల్లలు, 15 మంది మహిళలు ఉన్నారు.
ఐదుగురు పిల్లలు, ఏడుగురు మహిళలుసహా మరో 21 మంది ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రాంతంపై పట్టుఉన్న సూడాన్ సైన్యంతో ఆర్‌ఎస్‌ఎఫ్ పోరాడుతోంది. దేశంలో మూడు సంవత్సరాలుగా జరుగుతున్న అంతర్యుద్ధంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం పట్ల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం ప్రతినిధులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.