హాంకాంగ్‌ ఘటనలో 128కి పెరిగిన మరణాలు | Hong Kong tower blocks fire death toll rises to 128 | Sakshi
Sakshi News home page

హాంకాంగ్‌ ఘటనలో 128కి పెరిగిన మరణాలు

Nov 29 2025 5:28 AM | Updated on Nov 29 2025 10:19 AM

Hong Kong tower blocks fire death toll rises to 128

మరో 200 మంది జాడ గల్లంతు

ఒక్కో అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తనిఖీచేస్తున్న అధికారులు 

ఎట్టకేలకు మంటలను ఆర్పేసిన అగ్నిమాపక సిబ్బంది

హాంకాంగ్‌/బీజింగ్‌: హాంకాంగ్‌లో నలభై ఏళ్ల క్రితం కట్టిన ఎత్తయిన భవనసముదాయాలను నలువైపులా అగ్నికీలలు చుట్టుముట్టిన ఘటనలో మరణాల సంఖ్య శుక్రవారానికి 128కి పెరిగింది. ఇంకా 200 మంది జాడ తెలీడంలేదని అధికారులు చెప్పారు. పలువురు గాయపడి ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒక భవనానికే అంటుకున్న మంటలు ఎలా అంతవేగంగా మరో ఆరు భవనాలకు వ్యాపించయనే అంశం మీదనే దర్యాప్తు అధికారులు ప్రధానంగా దృష్టిసారించారు. బుధవారం మధ్యాహ్నం మొదలైన మంటలను ఎట్టకేలకు శుక్రవారం ఉదయం 10 గంటలకు పూర్తిగా ఆర్పేయగలిగారు. 

నిప్పులకుప్పగా మారిన బహుళ అంతస్తుల భవనాల అపార్ట్‌మెంట్లలోకి అధికారులు ఒక్కోటిగా తనిఖీలుచేయడం మొదలెట్టారు. దీంతో అగ్ని, పొగ, ఊపిరాడక పోవడం వంటి కారణాలతో చనిపోయిన మరికొంత మంది మృతదేహాలు బహిర్గతమవుతున్నాయి. శుక్రవారానికి మరణాల సంఖ్య 128కి పెరిగిందని, ఈ సంఖ్య మరింత అధికమయ్యే అవకాశముందని హాంకాంగ్‌ ప్రభుత్వంలో భద్రతాశాఖ కార్యదర్శి క్రిస్‌ టాంగ్‌ పింగ్‌ కుంగ్‌ చెప్పారు. మరోవైపు భవనాల మరమ్మతు, ఆధునీకరణ పనులతో సంబంధమున్న ఎనిమిది మందిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్‌చేశారు.  


 

Advertisement
 
Advertisement
Advertisement